పుట:కాశీమజిలీకథలు-12.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాక్షసుని గర్వభంగము

179

అట్టి సమయమున మదనతాపముచే వేగుచున్న పుండరీకరాజేంద్రుండు పూర్వరాత్ర కరణీయముల నిర్వర్తించుకొని జ్యోత్శ్నామృతోపశాలితం బగు సౌధాగ్ర మున కేకతమఁ బోయి యందు విలాసపట మండపమున ధవళచీనచ్చద్యాబరంబున డంబుమీరు హంసతూలికా తల్పగతుండై పాలమున్నీటియందు మధుసూదనునిభాతి నతిశయించి యుండెను. హరిణలాంఛనుఁడగు చంద్రునిజూచి తదాకారసాదృశ్యంబగు చిత్రపటము దలంపునకు వచ్చుటయు నయ్యది చేతఁ బట్టుకొని యందు లిఖింపబడి యున్న యన్నులమిన్న రూపమును, ననిమేషదృష్టులం దిలకించుచు నిట్లు తలంచు కొనెను.

ఔరా ! ఈ కన్యకాలలామ నా కెట్లు సమకూడఁగలదు? ఈమె నే యుపా యమునఁ గనుంగొనఁ గలను ? నేను ముందేమి యొనర్పవలయును? నా మనోప హారిణి నెందు వెదకుదునని చింతించుచు మరియు నతండు నిలింపుల మందిరముల యందు విధ్యాధరుల పురములలో గుహ్యకాశ్రయముల భుజగరాజధానుల నామె యెందున్నదో వెదుక నుత్సహించుచు, నంబరమున కెగుర, గిరుల నుల్లంఘింప, భూమి నతిక్రమింప, సముద్రమును దరింప, ద్వీపాంతరముల కరుగ, నురగలోకమును ప్రవేశింపఁ దలంచుచు, నందులకుఁ బక్షుల సర్వగామిత్వమును, జగదేక చక్షుషుండగు సూర్యుని సర్వలోకత్వమును యోగసిద్ధుల సర్వవేదిత్వమును నపేక్షించుచు, మదన మూఢుండై సితకర కిరణసంతానముల గగనారోహణరజ్ఞువులని భ్రమించి వాని నూఁతగఁ బైకెఁగ నుంకించుచు, కుముదవనమారుతారూఢుఁడై దిక్కులఁ బరిభ్రమింప నూహించుచు, నిట్లనేకభంగుల హృదయాందోళన మందుచుఁ గొంతకాలము గడిపెను.

ఆ రాజేంద్రుం డిట్లు విరహతాపమున వేగుచు నాకసము వంకఁ జూచు చుండ నా విమలచంద్రికాపుంజమున నకస్మాత్తుగా విస్తార యంధకారము గ్రమ్మెను. దాని కతం డబ్బురంపడుచు ఓహో ! ఇదేమి ? ఇట్లత్యద్భుతముగ నంధకార మావ రించినది ! ఇంతలోనే హిమాంశుండస్తంగతుఁ డగుటకు హేతు వెయ్యది ? నేఁటి తిథి ననుసరించి ప్రథమయాయంబునఁ కొన్ని గడియలు తప్ప రాత్రియంతయును జంద్రుఁడు ప్రకాశింపుచుండవలెను గదా ? ఇది హేమంతమును వర్షాగమమును గాకుండుట వలన నాకసము నిర్శలముగా నుండవలెను. మరియును సంపూర్ణగ్రాస మగు జంద్రగ్రహణము గలిగె ననుకొనుటకైన నేఁడు పూర్ణిమకాదే?

ఇంక యిదేమై యుండును? అంజనపర్వతము దిరుగ ఱెక్కలఁ దాల్చి నంబరతలమున కెగిరియుండలేదుగదా ? లేక యకాలజలధరసమావేశ మగుచుండెనా ? కాకున్న నెవఁడైన నిట్లింద్రజాలమును బ్రదర్శించుచుండెనా? అని యిట్లారాజేంద్రుండు విత్కరించుచున్న సమయమున నయ్యంధకార మెల్ల బుంజీభవించి గగనము నుండి