పుట:కాశీమజిలీకథలు-12.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నందుండి లేచి ముందు నడచుచున్న కుమారకేసరి నత్యంత ప్రేమోపచార వచనముల నాదరించుచు నమ్మణి మండపము వెడలి వసంతశీలుని యనర్ఘ పారితోషికముల బ్రీతునొనర్చి తురగారూఢు డై సామంతవర్గము జేయునతులందుకొనుచు గ్రమం బున నిజనగరంబున కేగెను. ఇంతలో నా కన్యాలలామను సమకూర్చు భారము నర పతి తనయందుంచి నాడని విధి యామెను వెదుక బంపెనో యనునట్లు పగలును స్యూరుడును గూడ నిష్క్రమించిరి. అప్పుడు రాజేంద్రుని మనమున మన్మధ రాగము నిండినట్లె పశ్చిమ భూభృచ్చిఖరమున సంధ్యారాగ మావరించెను. పిదప గాఢాంధకారము దిశలెల్ల నాక్రమించుకొనెను.


331 వ మజిలీ

రాక్షసుని గర్వభంగము

నాఁటిరాత్రి చీఁకటి పురమెల్ల దట్టముగా నలుముకొనెను. ఇది స్థలమిది నీరిది మెరక యిది పల్ల మని నిరూపింప నశక్యముగా నుండెను. ఇంతలో జనార్థనుని చేతిపాంచజన్య మట్లు, కాళియపణా పంజరమందలి నిర్మోకపుంజముగతి, యమునాజల మందలి ఫేనపిండము డంబున, కువలయవనమందలి హంస విధమున తారకానాధుం డంబరము నలంకరించెను.


గీ. చీఁకటికి సూడు వీఁడని వీఁక మిగుల
    మఱుఁగునభిసారికర చూపుమంటలఁబడి
    చందురుఁడు బూదెబుంగయై స్వచ్ఛబింబ
    మడరఁ దొలిదిక్కుగట్టున నమరియుండె.

మరియును,

గీ. ఇనుఁడు లోకాంతరంబున కేగ నపగ
    తాళిఘనశిరోజకలాపయైక మలిని
    విధవలోలె వెన్నెలయను విమలవస్త్ర
    మునుముసుంగిడుకొని మోము ముడుచుకొనియె.

అప్పుడు చీఁకటిపడఁగ నభము శుభ్రకాంతు లీనుచుండ గుముదములు వికసింపఁ దమ్ములు ముకుళింప, శశికాంతశిలలు చెమ్మగింప, జారచోర ప్రచారములు సన్నగింప, విరహిణుల చిత్తముల కనంగతాప మతిశయింప, జగమున కాహ్లాద మొన గూర్చు సుధాంశుండు మింటఁ బ్రకాశించుచుండెను.