పుట:కాశీమజిలీకథలు-12.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

177

ఇంతలో శాపదోషము మూలమున నాకు చైతన్యము దప్పినది. ఇంద్రియార విందములుముకుళితములైనవి. లోకమెల్లనంధకారబంధురమయ్యెను. ఆత్మ జడత్వమును వహించెను. పిమ్మట నేనెవ్వడనో, యెచ్చట నుంటినో, యేమైతినో, యే రూపమున మెలగితినో, యెచ్చ టెచ్చట దిరిగితినో, యెట్లు పొట్టపోసు కొంటినో నా కేమియు దెలి యదు.

నేడచట శాపాంతమగుటచే నిజస్వరూపమును దాల్చి విస్మయమున ముందు జూడ భవదీయ దివ్యదర్శనమయ్యెను. చిత్రపటమందలి రూపమును నేనిప్పుడు చూచిన రూపమును నొక్కటే యగుటచే పూర్వస్మృతి గలిగి యత్యంతానందమున నిటకేతెంచి దేవరవృత్తాంత మెల్ల బ్రతీహారి ముఖమున నెరింగి ప్రభు సన్నిధానమునకు జేరితిని. ఇదియే నా వృత్తాంతము.

ఈ పటమందలి యోషామణి నాఁడు సముద్రగర్భమందు నేను చూచిన సుందరాంగియే. ఇందున్న దేవరస్వరూపమును బ్రత్యక్షముగ గనుంగొనగలిగితిని. ధన్యుండ నైతిని. సాధ్యాసాధ్యము లెరుంగక లంకా విజయ మొనర్పబూనిన నా మనం బునకు భవదీయ దివ్యదర్శనంబున శాంతియొదవెను. సంసారాంభోది పతనంబు మూలం బున నాకు భవత్పరిచయ రత్నలాభ మొదవినదని సంతసించుచుంటిని.

దేవా ! మర్త్యలోక మకరథ్వజా ! నా మాట నమ్ముము. ఆ కన్యాలలామ చిత్రగతమైన నిజమూర్తి దేవర ప్రతిబింబమును హృదయమున దాల్చి యెటుల సేవించుచుండెనో యట్లే యీ‌ చిత్రపటమును విడువక యా యంబికాదయితు నారా ధించుచుండుట బరికింప‌ నీయందామె యనురాగము గలదై ప్రసూన శరనాయకశిఖా దందహ్యమానమానసయై యెట్లో కాలము గడుపుచున్నదని తలంతును. ఆమె సౌందర్యమనన్య సామాన్యము. నిఖిల విశ్వనిర్మాణదక్షుండగు పరమేష్టి సృష్టి నైపుణ్య మునకెల్ల నామె రూపము దలమానికముగదా ! ముల్లోకముల యందును సౌందర్య మున బ్రసిద్ధికెక్కిన శచీప్రభృతుల రూపముగూడ నా కన్యకా లలామయెదురగ వన్నె కెక్కనేరదు. త్రిభువనాధిపత్యమైన దొసంగ సమర్థమగు తపముగూడ నట్టి యువతీ రత్నమును లభింపజేయజాలదని యూరకుండెను.

అప్పుడు పుండరీకు డిట్లనుకొనియె. ఆహా ! ఈ కథ యెంత వింతగా నున్నది ? దీనిని వినినదివోలె నా హృదయమున నెద్దియో నూతన సంతోష మంకు రించుచున్నది. విషయ కర్మకల్లోల లీలాగర్భితంబగు సంసార మహాసముద్రాంతరమం దట్టి కన్యారత్న మెచ్చట గనుపింపగలదు ? కాని యఘటనఘటనా సమర్దుండగు విధి కసాధ్యమెద్దిగలదు ? అట్టి విధియే నా కనుకూలవర్తియై యున్న యా యన్నుల మిన్నను నిక్కముగ నాకు సమకూర్చునని నమ్మెదను? అని యిట్లు దలంచుచు