పుట:కాశీమజిలీకథలు-12.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నుండి ఇద్దరు ముగ్గురు చెలికత్తెయలతో నాకన్యకాలలామ యతిరయమున నచటి కేతెంచినది.

అట్లేతెంచి నాచేతనున్న చిత్రపటమును జూచి నిశ్చేష్టితురాలై నిముస మాత్ర మెద్దియో ధ్యానించి మొగమున నించుక కినుకదోప నన్ను శపించినచో తపస్విని కిట్లనియె.

ఆర్యాణీ ! ఇదేమి ! సకల ప్రాణముయందు సమానానుకంపజూపు భవా దృశులు క్రోధమలోపలేపంబైన చిత్తమును విమల సమాధి సింధూదకమున గడిగి వై తురుగదా ? కృపారసతరంగిణీ ! ధవళభస్మాను లేపనమున హిమకాలచంద్రికవలె శీతల స్వభావమైన నీవిట్లు త్రీవత బూనదగునా ? కరాగ్రముల జుట్టుకొనియున్న రుద్రాక్షవలయముచే దర్శినీయమగు నీ మూర్తి పన్నగావృతమగు చందనలతికవలె నిట్లు భయంకరముగా నున్నదేమి ? ఘనకోపానలజ్వలితమగు చూపుచే జలధరము వడువున నశనిపాతంబొనరించుచు నమృతాకాంక్షితంబగు లోకము నేలతపింప జేసె దవు?

ఆక్రోశ కటురవములగు మాటలచే నింపగు బాలమున్నీటియొడ్డున విరుగు నలలయలజడివలె నేల వ్యధ కలిగించెదవు ? భగవతీ ! ఇంద్రియ నిగ్రహంబొనరించి భవసంబంథమును దూరముజేసి‌ యుంటివనుమాట నీవిప్పుడు మరచితివా యేమి ? ఈ శిలా వినిర్మిత శుక్తికా భంగంబు నెపంబున సాధువృత్తి విడనాడి సర్వార్థముల కనర్ద మూలమగు కోపము వహించి వీని నిట్లు శపించితివి.

మరియు నో దేవీ ! హరిహరబ్రహ్మలకైన దులాపమై నిశ్రేయసర రసా స్సంబై విజ్ఞానతేజోమయమై, వివేకమాణిక్య నిర్మాణమై యొప్పు క్షమాశుక్తిం గాంచి యున్న నీ వీతుచ్చవస్తుభంగమున కిట్లు క్రోధముబూనుటవలన నీ నియమమున కనర్దము వాటిల్లును గదా ? కావున సంసారసాగర గ్రాహమగు నరిషడ్వర్గవిజయము నెట్లు పొందితివో యట్లె ప్రశాంతివలన గోపము నుపశాంతించుకొనుము. పరిశుద్దాశయు డగు వీనికి శాపాంతమును బ్రసాదింపుము మరియు నితండు శుకజాతి బుట్టినను నత్యధికమగు మనుష చైతన్యముతో గాలము గడపునట్లనుగ్రహింపుమని ప్రార్దించు చున్న యా చిలుకల కొలికి పలుకల కలరి ప్రసన్నురాలై యా తపస్విని యిట్లనియె.

కుమారీ ! నీవు కోరినట్లే యగుగాక. ఈ పటము వీని తలమీద బింఛమై పెరుగుచున్నకొలది విజ్ఞానమభివృద్ది‌ నొందుచుండును. మరియు మదీయాసనగతుండై యరుణమణి మయంబగు‌ నీ శుక్తి‌ నెట్లు భగ్న మొనర్చెనో యట్లె యొకప్పుడొక జగ దేక వల్లభుని యాస్థానవేదిక నెక్కి శుక్తికాయమానంబగు చంచూభంగం బొన రించుకొని నిజస్వరూపము నందగలడని నాకు శాపాంతమును బ్రసాదించెను.