పుట:కాశీమజిలీకథలు-12.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

అతి విస్తరమేల?


గీ. ఇంతి సుందరరూపసంసృష్టిఁ జేసి
    కాంచఁగ విధాతమదిఁ బుట్టెఁ గామవహ్ని
    దాని సైరింపలేక శైత్యంబుఁ బడయ
    నతఁడు హారిబొడ్డుతమ్మియం దధివసించె.

ఇట్టి యనన్య సామాన్య రూప లావణ్యాతిశయమున నొప్పు నొప్పుల కుప్పం దిలకించి నేనంత్యంతాశ్చర్యస్వాంతుడనై యిట్లు తలంచితిని.

ఆహా ! ఈ యువతీరత్న మెవ్వరు ? ఎచ్చటనుండి విచ్చేసినది? ఇట్టి సుందరీమణులుగూడ సముద్రగర్భమం దుందురుకాబోలును తొల్లి సముద్రమధనసమ యమున నందుండి లక్ష్మీదేవి యుత్పన్నమై నారాయణుని జేపట్టియుండలేదా? రూపాతి రేకమున రతి ప్రభృతి యువతీమణులకన్న మిన్నగ నొకయలివేణిని నిర్మింప నుత్సు కతం బొంది విధాత యీయేకాంతప్రదేశమున కేతెంచి యీ స్త్రీరత్నమును నిర్మించి యుండలేదు గదా ?

రూపసంసృష్టియందు ప్రధమాభ్యాసముగా నతండు మొదట లక్ష్మిని నిర్మించి యుండవచ్చును. ఈ యసామాన్యసృష్టి కుపాధానమృత్తికం గొనివచ్చు తురంగమే యుచ్చైశ్రవము, స్తనబింబపిండముల కాధార మైరావతకుంభి శ్వాసపరి మళోపయోగద్రవ్యము పారిజాతము, ముఖముదిద్దుటకు పరికరము హిమాంశుబింబము, కరప్రక్షాళనజలం బమృతము మెరుగువెట్టుఱాయి కౌస్తుభమాణిక్యము, ఈ యంగ నిర్మాణవస్తువులెల్ల సురలకు సముద్రమందే గదా దొరికినవి. ఇట్లనేక విధముల నేను విత్కరించుకొనుచుండ నావేదండగమనకన్యాకదంబముతో నా యాలయప్రాంగణము నకు దక్షిణముగానున్న మార్గమున బుష్పాపచయం బొనర్ప బూదోట కేగెను

పిమ్మట నందుండి ఛత్రవాహిని యను నొక రమణి వడివడి నేతెంచి యా యాయతనమును బ్రవేశించి గొడుగు ముడిచి యొక మూలబెట్టి దివ్యాంశుకావేష్టితం బగు నీపటమునుగూడ దానిమీద నుంచి వెంటనే యందుండి వెడలి యాకన్యా సమూ హమును గలసి కొనెను. ఆ యువతి కార్యాంతరవ్యగ్రహృదయయై యున్నకతమున నాతొందరలో సమీపమందున్న నన్ను జూడలేదు.

అప్పుడు వారు పుష్పాపచయమునుండి తిరిగి వచ్చులోపల నందు వస్త్రమున జుట్టిపెట్టబడిన వస్తువేమో చూడవలెనను నుత్సాహము నెమ్మనమున వేధింపనే నత్యంత వేగమున నాప్రదేశమున కొకగంతువైచి యా బట్టచుట్ట జేత బట్టికొని విప్పిచూడ నీ పటము గనంబడినది. అందొకవైపున నాస్త్రీరూపమును, మరొకవంక భవదీయరూప మును జిత్రింపబడియుండుట దిలకించి నేనత్యద్భుతరసావేశహృదయ సరోజాతుండనై యొండెరుంగక మీయిర్వుర రూపవిలాసవిశేషముల గనులు విచ్చి యతిశ్రద్ధగ బరి‌