పుట:కాశీమజిలీకథలు-12.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వమున బౌరుషముకన్న విధి బలీయమని పల్కినమాట లన్నియును యధార్థములైనవి. సముద్రమందు మరణించి నేనిప్పుడు పరలోకమున కేతెంచి యుండుట నిక్కము. ఈ ప్రాకారాంత మందున్నది యమ మందిరము గానవచ్చును. నేను నరలోకమున బడి తినా ? కాదు కాదు. నేనెంత నికృష్టుండనై నను నత్యదశయందు దివ్య‌పురుష సంద ర్శనం బొనరించి దివ్యయానాధిష్టితుండ నగుటచే నాకుత్తమలోక సంప్రాప్తికలుగవలెను. కావున నిది స్వర్గద్వారము. నరక స్వర్గంబుల నేదియైన నింత శూన్యముగ‌ నుండునా? అయ్యో ! నేనిప్పుడేదియు నిశ్చయింప జాలకున్నాను. ఏమైన గానిమ్ము. నాకిట నీ యవాంతర వితర్కమేల? ఈ ప్రాకారాంతరమున కేగెదగాక. పిమ్మట నేమి జరుగ నున్నది ? యది జరుగగలదని తలంచుచు జంద్రకాంత మాణిక్యఘటిత కవాటముచే నతి సుందరమైన యా ప్రాకారద్వారమున లోన బ్రవేశించితిని.

అందు దట్టమగు మణిధూళిచే నరుణ కాంతులీను మార్గమునబడి కొంతదూర మరుగ ముందుగాలిచే గదలు నాకు జొంపములలోని కల్ఫతరు మంజరులవలె నెలరారు గుత్తులతో నలరారుచు, గనులకు మిరుమిట్లు గొలుపు జలువఱేని పడగలవలె రతనంపు గాంతుల దుర్నిరీక్ష్యమగుచు, మిసిమిమించు బంగరు కొండవలె జెలువొప్పు గొప్ప వెలుగు గుప్పతో నొప్పుచు, నత్యంత ప్రభావముచే బ్రజ్వరిల్లు చున్న నొక్క ప్రదే శము గనుంపించెను.

ఆ ప్రదేశము జూచినతోడనే నా మదికి మిగుల దిగులు గలిగెను. రెండు మూడడుగుల వెనుకకు వైచి యిట్లు విచారించితిని అయ్యో ! నేనిందు బడబాగ్నిలో బడిపోవుచుంటినా ? మహార్ణవగర్భమున నింక దేని కిట్టి చండతేజం బుండగలదు ? అంతులేని కాంతుల కిది విధానముగావలయు. ఓహో 1 తెలిసెఁ దెలిసె. ఈ మహా తేజమువలన శోషింప బడుటచేతనే యిందు నీరించుకయునుం లేకుండెను. ఇచ్చట గల్గు శీతలప్రకారమే నా యూహను ధృవపరచుచున్నది అట్లు గాకున్న నింకేమై యుండును? కానిమ్ము. ఏదైన నేమి? సాహసమున ముందేగెదను నాయనుమానమే తిరమైన నిందు మడిసెదను. లేకున్న నపూర్వ వస్తు సందర్శనమున గన్నుల కలిమి సార్థకము జేసికొందును. ఈ విశేషమేమో చూచెదనుగాక అని నిశ్చయించుకొని ముందున కేగితిని.

అట్లు సంశయాకులిత చేతస్కు.౦డనై ముం దేగుచుండ ననతిదూరమందే యా తేజో రాశినడుమ నత్యంత దేదీప్యమానం బగు దేవతాయతనం బొండు గనుల పండు వొనరించెను. దాని సమీపమున జక్కని పూదోట కలదు. అప్పుడు మది కుదుట పరచుకొని నేనెనత్యంతరయమున నా గుడిలో బ్రవేశించి యందు బ్రతిష్టింప బడియున్న పురాణదంపతుల నుమామహేశ్వరుల గనుగొంటిని. తోడనే నిటలతట ఘటిత కరపుటుండనై యభీష్టసిద్ధి కప్పరమేశ్వరు నిట్లని స్తుతించితిని.