పుట:కాశీమజిలీకథలు-12.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

169

బోయి యందొకచో శయనించి గాఢముగా నిద్రబోతిని. ఇంతలో వెలుపల నెద్దియో సందడి యగుటచే మెలుకువ వచ్చినది బహిర్మండపమున, జాలమంది జూదరులు ద్యూతక్రీడాభిరతిం దవినియున్నట్లు వారిమాటలవలన నాకు దెల్లమయ్యెను. ద్యూత ప్రసంగము చెవులబడిన యనంతరము నాకన్నులకు కునుకురాలేదు. ఆయాట జూడ వలయునను నుత్సాహము నెమ్మనమును వేధింప, నతిరయమున నందుండి లేచి కృపాణము చేత బూని వారి సమీపమునకు బోయి యాసమాజమందు జేరి యమందా నందమున జూదముడ దొడంగితిని. అక్షవిద్యారహస్య సంవేదినైన నేనే యం దున్న వారికెల్ల బై చేయినై యన్నిపందెములు గెలుచుకుంటిని. గాకందుగలపాండిత్య మెల్లరును బ్రస్తుతింపసాగిరి. వారు కొనివచ్చిస దివ్యమణిసందోహ మెల్ల నాకశ్రమమున‌ వశ మయ్యెను. తిరుగ బందె మొడ్డుటకు వానియొద్ద నిం కేమియును లేనందున విభ్రాంతులై చూచుచుండ మింటనుండి విమానముమీద నోకపురుషుం డం దేతెంచెను. వానిని నేను దివ్యపురుషుండని భావించితిని. మా యుదంత మెల్ల నతండు విని మందస్మితమున నాతో నిట్లనియె.

పుణ్యపురుషా ! నీయక్షక్రీడాపాండిత్య మపారమైనది. ఇట్టి నీతో విలాస ముగా నాడుటకు నామనంబుంతేని యుత్సుకతం బొందుచున్నది. కాని పణ మొడ్డుటకు నాయొద్ద నీ విమానముకన్న నొండెద్దియును లేదు. కావున దీని నే నొడ్డుచున్నాను. పందెము వేయమని నన్ను బురికొల్పెను‌. నే నంతకు గెలుపొందిన రత్నముల గొన్నిటి నొడ్డి పందెము వైచితిని. కాని నేనే యోడితిని ఇంకొక పందెము వైచితిని. అదియును గూడ వెనుకటి దానివలనే యైనది. నే నార్జించిన మాణిక్యరాశి నెల్ల నతండు గెలుచు కొనెను. అన్ని పందెములు నేనె యోడుచుండుట నా కెంతేని యబ్బురముగా దోచెను. ఇక బణ మొడ్డుట కేమియును జేతలేనందున నేను విభ్రమమున నుండ నతండు మంద స్మితమున సోదరా ! ఊరుకుంటి వేమి ? ఇదియే కపటిమాట. నీ యొద్ద కృపాణ మున్నదికదా ! నీవు దాని నొడ్డుము. దానికి బ్రతిగ నా విమానము నే నొడ్డెదను. ఇది దివ్యయానము గలదని‌ యెరుంగుము. నీ కృపాణమున కిది తీసిపోదని పలుక నే నందులకు సమ్మతించితిని. తృటిలో నాదివ్యయానము నావశమయ్యెను. అంతటితో దృప్తిపడక నే నా కృపాణమునే యొడ్డి యింకొక పందెమువైచి యోడిపోతిని. ఆ చంద్ర హాసము నా పురుషుండు గైకొని యిక నాట చాలు నని చెప్పి మాయమయ్యెను అందున్నవారెల్ల నిముసములో నేమైరో గ్రహింపకుండ బోయిరి. నేను గెలుపొందిన విమానముమాత్రము నా సమీపమందుండెను. దానికి నేను విస్మయ మందుచు నిట్లని తలంచితిని.