పుట:కాశీమజిలీకథలు-12.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

కావున వివేకము గలిగి నాపూన్కె నెఱవేర్చుకొనెదను. ఇప్పుడే నేనిందుండి బయలు దేరి పోయెదంగాక ! విధి బలీయమని చెప్పుట యీనాటి మాటకాదు. దాని నెవ్వరును విశ్వసింపదగదు. నేనొక్కడనై నను నన్నెదుర్కొను బగతుర బిల్కుమార్చియైన ముందేఁగఁగలనని దర్పోద్రేకంబున లేచి పిప్పలకా ! నీవుండుము. నేబోయి వచ్చెదనని వానిని వీడ్కొల్పి యటనుండి గదలి యమందగమనమున నా గ్రామము విడచి పోయితిని.

దుర్వ్యసనపరాయణుం డెట్టివాడైనను నపహాస్యమునకు లోనగును గదా ! అట్లు బోవుచు నే నేనగర మేగినను, నే గ్రామము ప్రవేశించినను, నెవనియింటిలోన కరిగినను నచ్చట వీడు జూచిరి. మన యిండ్లలో నేమైన దొరికినది దోచుకొని పోగల డని జాగరూకతతో నే నావలి కేగువరకు కనిపెట్టుకొని యుండెడివారు. ఒకొక్క యూరద్యూత విద్యానిపుణులు నన్నాదరించి యక్షక్రీడాసక్తుం జేయుచుందురు. ఆ యానందమున నా పయనముమాటయే మరపువచ్చుచుండెడిది. అప్పుడప్పుడు జూదమువలన గలిగిన గెలుపుసొమ్ము పూర్తిగ నోడువరకు నా వ్యసనమునంబడి మైమరచి యుండెడివాడను. చేత గాసైనలేనప్పు డింకెట్లు ద్యూతక్రీడకు గడగువాడనని చింతిల్లుచుందురు. ఒకప్పుడు వివేకముగల్గి నా మూఢత్వమునకు నేనే నవ్వుకొను చుందును. ఇట్టి ప్రవృత్తితో ననేకదినములు గడపుచు బయనము సాగించుచుండ నుత్తరదక్షిణావనీభాగములు గలహించి యొండొంటి డీకొన నారెంటి నడుమ దగవు దీర్ప నడ్డుగాజూపిన సముద్రుని భుజదండమువలె నొప్పుచు గాలిచేఁగదలు వీచికాశిఖర శీకరప్రకరములతో వరుణకుంజర మదావస్థయన జెలగుచు దీరముల నిర్మింపబడిన తావసానేకకుటీరములను ధర్మ పురమువలె నలరారుచు, నిర్వాణనగర వీధివలె జెలువైన రేవాపరాభిధానముగల నర్మదానదీతీరమును జేరుకొంటిని.


మ. ఘనరేవాభిదనొప్పుదాని విశదాఖర్వప్రవాహద్యుతిన్‌
     గన సాక్షాద్దివినుండి వచ్చిన వియద్గంగాసరిద్రీతి నొ
     ప్పెను వాతోచ్చలితాంబుబిందుతతి తద్విఖ్యాతతీరాళ్మవీ
     ధిని జిందన్‌ గనుపించెఁ దారకలు బ్రోదిన్‌ జేరియున్నట్లొగిన్‌.

పిమ్మట నే నా మహానదికి నమస్కరించి దానిం దాటి దిక్షిణా పథమునం బ్రవేశించితిని. అందుండి తిన్నగా సముద్రమధ్యమందున్న లంకాపురమునకేగ నత్యు త్సాహంబున బయలుదేరితిని. ఇట్లు క్రమంబున భిల్లపల్లియల నతిక్రమించి, గ్రామ ముల విడచి నగరముల బరిత్యజించి, వనంబుల దరించి, పర్వతంబులదాటి చివుర కత్యంత భీకరంబగు నొక మహారణ్యమధ్యంబున జిక్కు కొంటిని. ఇంతలో సూర్యుం డస్త గతు డయ్యెను. క్రమంబున గాఢతమంబు దిశల నాక్రమించి నేత్రములున్న ఫలంబు బోగొట్టెను. అప్పుడిట్లని చింతించితిని. అయ్యో ! ఇమ్మహారణ్యమున నిర