పుట:కాశీమజిలీకథలు-12.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

165

కుండను వృద్ధ ద్యూతకారుని గృహమును దెలిసికొని యందు బ్రవేశించితిని. అతం డును నభాగ్యతుండనని, రాజపుత్రుండనని, ద్యూతమిత్రుండనని, నా యందత్యం తాదరము జూపుచు యధోచితస్వాగత ప్రశ్నాసనాది సత్కారముల నా కెంతేని సంతస మును గూర్చెను. పిమ్మట భోజనముచేసి శయ్యాగతుండ నైయున్న నా సన్నిధి నాసీనుడై యతండతి వాత్సల్యముతో కుమారా ! దూరదేశ యాత్రకు బోవ దలంచి నట్లు కనంబడుచుంటివి ? ఎచ్చటి కరిగెదవు ? ఏమి పనిమీద బోవుచుంటివి ? పరు లెవ్వ‌రికిని దెలియగూడదని ప్రయోజనమందేమి గలదు ? తోడులేక పోవనేమిటికని ప్రశ్నించెను. “సత్య మెరింగించిన నా ప్రవాసమున కంగీకరింపక యితండు నా జన కున కీ రహస్యము దెలియ బంపి నా పయనమున కంతరాయము గల్పింపగలడు. అట్లుగాకున్న వృద్దుడైనను నా యందలి ప్రేమచే వెంటబడును. వీనిని నమ్మరాదు. యదార్దమును గోప్యముజేసి వచించి వీనిని వంచించెదగాక” యని దలంచి వానికి నే నిట్లంటి :-

పిప్పలకా ! వినుము. ఇచ్చటకు దక్షిణముగా సముద్రము గలదు. దానిని దాటిన నమానుషప్రచారమైన ప్రదేశ మొండు గన్పించును. అందు దేవతలకైన నసాధ్యమగుభాగ్యము గలదు. దానిని నేను సాధించి తెచ్చుటకు బోవుచుంటిన‌ని ప్రత్యుత్తరం బొసంగితిని.

అతి ప్రసిద్దద్యూతరసికుండనని నన్నెరింగిన యతండు జూదమునకై యెవనినో నిర్భంధించి ధనము దెచ్చుట కెచ్చటికో పోవుచుంటినని తలంచి దృఢ ప్రతిజ్ఞుండగు రాజపుత్రుని ప్రతికూలవచనంబున నొప్పింపనేమిటికని యూరకుండెను. పిమ్మట ద్వారప్రదేశమున కరిగి సేవకునిభాతి నాయుధముబూని యా రాత్రియెల్ల మేల్కాంచి యా వృద్ధుండుండెను. నేనును దూరము నడచివచ్చిన శ్రమచే గాడముగా నిద్రబోతిని. రాత్రి మూడు యాయములు దాటినపిమ్మట నాకొక స్వప్నమైనది. ఒకా నొక కాననమున వనలక్ష్మివలె నతిసుందరాకారమున నొప్పు స్త్రీ రత్నము మబ్బులో జిక్కుకొనియున్న కంఠీరవము నుద్దేశించి యిట్లనినట్లు వినంబడెను.


గీ. విక్రమంబునఁ గరిబృందవిదళవైక
    మల్లుఁడ వతిబలుండవు మహి మృగేంద్ర !
    కాని‌ యిపుడు పయోభృతిఁ గడిమి‌ సెడితి
    వకట ! విధిముందుఁ బౌరుష మడగదొక్కొ .

ఇట్లు విని స్వప్న సంభ్రమంబున వెంటనే మేల్కాంచి యిట్లని తలంచి తిని. ఆహా ! ఇది కల. ఈ విధమున నా యన్వయదేవత దైవబలము లేకున్న నేపని యును సాధింపబడదని సింహశిక్షాకైతవమున నాకుపదేశమొనర్చి యుండవచ్చును. పయోభృత్పళంసవలన నేను దాటవ‌లసిన సముద్రము స్ఫురించుచున్నదిగదా ! కాని కలలెల్ల గల్లలు. అట్టివానిం బురస్కరించుకొని బడలుపడుట కాపురుషలక్షణము.