పుట:కాశీమజిలీకథలు-12.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

163

యగు మురారి శరీర సంపర్కమున బవిత్రవంతములగు నుదకములుగలిగి మిగుల బ్రసిద్ధికెక్కిన యమునానది యప్పురి కుత్తరదిశ నాశ్రయించి ప్రవహించుచుండును.

ఆ పట్టణమున కధినాధుండై కళినకేతుండను రాజు గలడు. అతండు హర చరణ సరోజసంసేవాసక్తచిత్తుండై నిజప్రతాపప్రసారము ననరాతిభూపతులకు భయ జ్వరము గల్పించుచు, హరునివలె యశోవిభూతి ధరించుచు, నింద్రునివలె సకలశాస్త్ర ముల సహస్రాక్షముల బరీక్షించుచు, నననరత సేవావినమ్రసామంతమౌళిమణిమండిత చరణ సరోజాతుండై, యనంతపరాక్రమోపేతుండై, యనిర్వచనీయ ప్రతాపుండై, దిగంతవిశ్రాంతకీర్తికలాపుండై మిగుల బ్రసిద్ధికెక్కెను.


చ. అతనియశోమరాళి కకుబంతములన్విహరించుచున్‌ మురా
    హితు నెదురన్‌ సుధాజలధి నీది వియద్గతిఁ బోవఁ దత్పయో
    ప్లుత గరుదుజ్ఘతాచ్చకణముల్‌ గ‌నఁ దారకలయ్యె దానియం
    చితవలయాంగ‌ ధీధితి విశేషము దా శశిబింబ మయ్యెడిన్‌.

ఆ రాజోత్తమునకు విచిత్రగుణశాలురగు పుత్రులు బలువురు పుట్టిరి. వారిలో గడగొట్టువాఁడు కుమారకేసరియను నపత్యహతకుండు. వాఁడు చంద్రాదిరత్నములగా లక్షయాంకురమువలె, గ్రహములలో గేతువువలె, సంవత్సరములయందుక్షయవలె, యుగములలో గలివలె నతిమలినాత్ము డై గడునింద్యచరిత్రుడై యుండెను. ఆ యభాగ్యుడే నేనని యెఱుంగునది - నన్ను పితరులు సన్మార్గమున‌ బెట్ట నెంత ప్రయ త్నించినను, నెన్ని నీతు లుపదేశించినను పూర్వకర్మ దోషమున వాని నెల్ల బెడచెవిం బెట్టి ద్యూత విషయావర్తిత హృదయుండనై మెలంగుచు వారికెంతేని విషాదమును గల్పీంచితిని.

ఇట్లనుక్షణ ప్రవర్థమానద్యూతక్రీడాభిలాషచే గ్రమముగ నిజధనమెల్ల నా దుర్వ్యసనమునందు వెచ్చించితిని. ఒకప్పుడు బంధుజనుల నర్దించియు, నొకప్పుడు శ్రీమంతుల నాశ్రయించియు, నొకప్పుడు జానపదుల బెదరించియు‌ సంపాదించినరొక్క మెల్ల నక్కితవ వృత్తిం బెట్టుచు నెట్టలో కొంతకాలము గడపితిని. ఈ పందెము నందు దప్పక గెలుపుగలుగును. ఇదికాకున్న నింకొక దానియందైన జయము నిక్కమను నాసతో గ్రిందుమీ దెఱుంగక ప్రవర్తించుచు గలధనంబెల్ల నోటి జననీజనకులకును, భ్రాతృవర్గమునకును గూడ సహింపరానివాడనై యొకనా డిట్లు చింతించితిని. ఔరా ! సమానులలో నే నెంత తేలికపడియుంటిని? నే నిట్లెంతకాలము గడుపగలను ? ధన హీను నెవ్వరును గౌరవింపరు. వాంఛితరసోపభోగ సంప్రాప్తికి ధనమేగదా మూలము. ధనసమృద్ధి గలిగినవాని కేమి లేకున్నను లోపముండనేరదు. శ్రీమంతులకు నాయకుం డైన నా తండ్రి ధనాగారమెల్ల నామూలమున శూన్యమైనది. నాయవజ్ఞతకతన నా జనని ముదిభూషణముల గోల్పోయెను. నాపైగల యనురాగము వలన బంధువులెల్ల దమ భాగ్యము నెడబాసిరి. రాజపుత్రుడ నను గౌరవమూలమున జానపదులు దమవిత్తమును