పుట:కాశీమజిలీకథలు-12.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుక పురుషుండైన కథ

159

వస్తువును జూచి యెద్దియో జ్ఞప్తికి వచ్చినట్లు తల పంకించుచు మందహాసభాసుర వద నార విందుడైరమణీయంబగు‌ నా మణిమండపము నలువంకల దిలకించి పిదప జూపుల బైటకు‌ బరపినతోడనే యెదురవు ననేక నవశరంబుల గ్రహింపనున్న కుసుమ సాయకునిలీల, నందనంబను భ్రమమున నివసించినపురందరునివలె, కమలకుల భవనావాసినియైన సిరిని గొనిపోవ నేతెంచిన పద్మనాభునిరీతి, నతిసుందరాకారమున నొప్పుచు, ననేక చక్రవర్తిలక్షణలక్షితుండై యనంత లావణ్యలలితుండై, యశేష సామంతభూపాలాశ్రితుండై, యసామాన్యవైభవోపేతుండైయనల్పగుణగణగరిష్టుండై లీలాసర స్త్సటంబున నుచితాసనంబున నుపవిష్టుం డై యున్న యా భూలోక రాజదేవేంద్రు నుపలక్షించెను.

తోడనే హృదయానందంబు మొగంబున గనుపింప నత్యంత జవంబున నా రాజేంద్రుని సమీపంబున కేతెంచి ప్రతీహారిముఖమున రాజానుమతంబు వడసి వాని యంతికంబున కరిగి యుచితప్రణామాదికం బొనరించి తదనుజ్ఞ నర్హాసనంబున నుపవిష్టుండై వాని నిట్లు స్తుతించెను.


మ. అనఘా ! గంధగజౌఘకుంభదళనం బందున్‌ భవత్కడ్గమం
     దున నగ్నంబయి చూడఁగల్గిన ద్యుతిస్తోమాతిగోళంబులన్‌
     జనముల్‌ ముత్యములందు రయ్యది‌ వృధాజల్పంబు సత్యంబదే
     మన ధారాజలమజ్గదూర్జిత రిపోద్యద్బుద్బుదవ్రాతముల్‌.

శా. దేవా ! నీ యసిధార నాజిఁ దెగి యుద్వృత్తిన్‌ ద్విషచ్చీర్షముల్‌
    ద్యోవీధిన్‌ బహురత్న సంయుతకిరీటోద్యద్యుతుల్‌ మారఁగాఁ
    బోవన్‌ నా కమయూరికబ్బె సుషమాపూరంబు, సౌరాంగనల్‌
    భావోన్మేషతఁ బెండ్లి వేడుకలకై వర్తింప నప్పట్టునన్‌.

పిమ్మట నాదూతనపురుషుండు నిజవామకరమున బట్టుకొనియున్న యా వస్తువును సవ్యకంబున గ్రహించి యారాజచంద్రునితో నిట్లనియె దేవా ! జగత్రయ నియామకుండగు బిడౌజునకైన బొందరానిదియును నెల్లజనులకును జూడ దలంపు బుట్టించునదియునునైన నీ వస్తువును పశుపతిప్రసాదమునకు బాత్రులైన దేవరకు సమ ర్పించు కొనుచున్నానని పలుకుచుండగనే వసంతశీలు డద్దాని నందుకొని పుండరీకున కర్పించెను. దానిం గ్రహించి యాభూకాంతుం డిదేమని‌ పలుకుచు నతిరయమున నాచుట్ట విప్పి చూడ నదియొక చిత్రఫలకముగా గనంబడెను. అందు దన స్వరూపమే లిఖింపబడియుండుట దిలకించి యత్యంతాశ్చర్యస్వాంతమున నౌరా ! నా స్వరూప మెట్లతనిచేత నిందు వ్రాయబడెనని విస్మయ మందుచున్న నరేంద్రునితో సర్వసేనా నాయకుండైన సింఘలాంగదుండిట్లనియె.