పుట:కాశీమజిలీకథలు-12.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని మృగవనవిహారము

157

లతామండపముల నుత్తరీయముల బరచుకొని శయనించిరి. కొందరు చల్లని ప్రదేశముల కరిగి నిదాఘతాపంబడగ విసరుకొనుచుండిరి. కొందరు క్రిందబడియున్న ఫలముల నేరికొని తినుచుండిరి. అప్పు డమ్మహారాజు దివ్యాశ్వమునుండి దిగి విజయవర్ధనునిపై జేయూని నడచుచు సమ్ముఖంబున కేతెంచి నమస్కరించిన వనపాలుని వసంతశీలుని‌ సన్మానించుచు, మందగమనమున నతిశీతలమైన ప్రదేశమందు విమలమణిశిలాఫలక వినిర్మితంబైన దివ్యమాణిక్య మందిరమును బ్రవేశించెను.


328 వ మజిలీ

చిలుక పురుషుండైన కథ

అందు మాధ్యాహ్నికకృత్యముల యధార్హంబగు రీతి నిర్వర్తించి పిమ్మట సమీపమున సుందర కాసారతీరమునగల సహకార విటపిచ్చాయల శిశిరజలసమీరసం గమసుఖం బనుభవించుచు విశ్రమించియుండి యా యుద్యానవన రామణీయకంబును దిలకించుచుండ వాని యభిమతంబెరింగి యింగితజ్ఞుండైన విజయవర్థనుండా మహా రాజున కిట్లనియె.

దేవా ! పరిపక్వఫలస్తబకములతో నిండియున్న యీ ద్రాక్షలతామండప మెంత మనోహరముగా నున్నదో చూడుము. మీదుగా నున్న తరులతాకుసుమముల నుండి స్రవించు మకరందమువలన దడిసిన యీ మాలతీలతామతల్లిక మదనరాజ్యాభి షేకవేదికవలె నెంత వింత గొల్పుచున్నదో కనుంగొనుము. మణిమండపాంగణంబున జంద్రకాంతశిలాసోపానములతో నతి సుందరముగ నిర్మింపబడిన యా దిగుడుబావి యెంత సంతోషప్రదముగ నున్నదో తిలకింపుము. అల్లదేదూరంబున వివిధ తరు లతా ప్రశోభితంబగు విలాసభూధర ప్రదేశంబెంత మనోజ్ఞముగ నున్నదో పరికిం పుము. ఈ బాలమాతులుంగీ వనంబునకు వామభాగమున కదళీఖర్జూర నారికేళాది పాదపసమూహంబునకు నీరెత్తు మోటనూతు లెంత వైశాల్యము గలిగియున్నవో గ్రహింపుము. అనేక జలవిహంగమ విహారయోగ్యమై కురవకనికురంబునకు దక్షిణం బున నున్న యా దివ్య సరోవర సౌందర్య మెంత యొప్పిదముగా నున్నదో వీక్షిం పుము. అని యిట్లనేక విధంబుల నా యుద్యానవన విశేషంబుల నంగుళీనిర్దేశంబున జూపించుచుండ జేరువనుండి వారికిట్లు వినంబడెను.


శా. ఓ చంద్రోపల గౌరి ! యో మరకత ప్రోజ్జృంభిత శ్యామలా !
    యో చామీకర భిన్న వర్ణవిమలా ? యో పద్మరాగాంబరా ?