పుట:కాశీమజిలీకథలు-12.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని మృగవనవిహారము

153

భూపాలబృందము వశంవదంబయ్యెను. వసుమతీ చక్రంబెల్ల నాయాజ్ఞదలదాల్చు చుండెను. మంత్రబద్ధయైనట్లు లక్ష్మీ నాకు వశీభూతమయ్యెను. మదీయరాజ్యమం దెల్లడలను సుఖసంతోషములు దాండవమాడుచుండెను. ఇట్లు సర్వార్ధసిద్ధిం జేకూర్చిన మదీయకృపాణం బొరయందిమిడియున్నది రణవినోదాభావముచే నా భూజాదండము దుస్థితిపాలయ్యెను. ఇక నే నేవినోదవిశేషమున గాలము గడుపగలను. హృదయాహ్లాద కరముగ నింక నేనే వ్యాసంగమున బ్రవర్తింతునని యడుగ రాజేంద్రుని యిం‌గిత మెరింగి చిత్రశిఖుం డిట్లనియె.

దేవా ! పుడమియందు మనుష్యునకు కల్యాణప్రదంబగు నఖిల సుఖోప భోగానుభవమే పర్యవసాయమగు వ్యాపారము. దాని కాస్పదమై హృదయవాంఛితము లొసంగునది రాజ్యలక్ష్మి. సప్తార్ణవతరంగ మాలాభరణంబగు వసుంధరయే రాజ్యము నకు మూలాధారము. అట్టి పుడమింబడయఁ బ్రద్వేషివంశవిచ్చేదనం బవసరమగు చున్నది. దానిని దేవరవారింతకు నొనరించియేయున్నారుగదా ? భూవలయ మధుపట లమున రాజ్యసుఖరసోపభోగలాలసులగు క్షుద్ర నరపాల బృందములనెల్ల పారఁదోలి తివి. వీరుల కవచముల నిజ నిశితాసి దండమున విచారించుటంజేసి పుట్టిన యనల జ్వాలల భవదీయభుజా కదనకేళీక౦డూతిం బాపికొంటివి. క్షురప్రముఖవిఖండితేభదంత ముసలములున్మూలింపఁబడిన విరోధివంశాంకురములవలె సంగ్రామ భూములయందు నీచే విరజిమ్మబడినవి. నిశితనిస్త్రీంశధారోత్తారితరిపుశిర శృంఖవలయములచే వీరలక్ష్మి నలంకరించితిని. వైధవ్య విధురితారి సీమంతినీనేత్రసలిలధారలతో మధూత్సవం బొనరించితివి. విపాటిత విపక్షవంశసమాకర్షుండవై యశోముక్తాఫలముల ద్రిభువనలక్షీ కాభరణములుగ నొనరించితివి. ఇట్టి నిన్నేమని వర్ణింపగలను.


మ. అనిలో నీనిశతాసి తీక్ష్ణగతి సూర్యౌఘంబు గల్పించిమించె,
     నరాతిప్రమదాశ్రుధారల‌ మహాసింధువ్రజం బేకమై
     దనరంజేసె ఘనారవంబున యశోద్వాంతాట్టహాసంబుతో
     డ నటించెన్‌ నరిశీర్షహారముల వేడ్కన్‌దాల్చి భీమాకృతిన్‌.

ఇట్లతిప్రతాపవిహిరం బొనరించి శత్రువంశనిల్మోలనము చేసిన నీకు భూవలయమున‌ నాయోధననినోద వ్యాపారమున కవసరము గలుగదయ్యెను. అయినను నీవొనర్పదగినదింకొక్కటిమాత్రము గలదు.


గీ. ధాత్రినిర్వైరులై రణోద్దతులనైన
    ధరణిపతులకు భుజవినోదంబుకొఱకు
    రోషచలితకిటీనికురుంబమందు
    దాపమడరింప మృగయాప్రసంగముండె.