పుట:కాశీమజిలీకథలు-12.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుకలాభము

147

భూతము. మరల విరచుకొని తినగలదు. దీనికి వెఱచియే నేను పారిపోవుచున్నాను. నీవును సత్వరమ యిందుండి పారిపొమ్ము. నీకు భయము లేకున్న నిందుండుమని భయార్తివిధురితచేతస్కుడై ప్రలపించుచు నా పట్టు తప్పించుకొని యొక్క పరుగున బారిపోయెను. నేనును నా యభీప్సిత మీడేరిన దని సంతసించుచు నా చిలుక యిక నలభ్యమని నిరాశ జేసికొని యున్న నాకు దాని దృటిలో దక్కజేసిన దైవమును నంతరంగమున గొనియాడుచు నా శుకశ్రేష్ఠమును గైకొని ప్రత్యూషముననందుండి పోవ నిశ్చయించుకొనుచు నా కుటీరమును వెండియు బ్రవేశించితిని. అందు శుకలాభ మునకు నెమ్మనంబున నుబ్బుచు తదీయాలాప విశేషము నెన్నుచు నవ్వుపుట్టించు పామరుని చేష్టితంబుల దలపోయుచుండుటచే నా కంటికి నిదురరాలేదు. ఆ రాత్రిశేష మా చిలుకతో బ్రసంగించుచు గడుపనెంచిన నా సంకల్పమెరింగి యా చిలుకయే నాతో నిట్లు ముచ్చటింపదొడంగెను.

మహాత్మా ! నా చిన్న విన్నపమొం డాలింప గోరుచున్నాను. పామర మహాగ్రహబాధనుండి బయటబడిన యీదీన శకుంతళాబకముతో దమకేమి పని గలదు ? మీరు మహాత్మ స్వరూపులు. మహాత్ములు దీనుల విన్నపము లాలింతురు. ఒరులకు కీడుసేయదలంపరు. యాచకుల కడిగినదాని నొసంగుదురు. కాన మిమ్ము ప్రార్థించుచున్నాను. పుడమిపై సర్వసంసార విషయములందును సారభూతమైనది ధర్మమని మిరుబోంట్లు వచింతురు. అట్టి ధర్మమునకు సారము ప్రాణకోటియందు దయయే యగును గదా ! దయాధర్మసార మార్తపరిత్రాణము. ఈ సద్గుణములు సజ్జనులకు సహజములై యుండును ! నన్ను మీరెవనికో యొక నరపతి కర్పింపదలంచు చున్నారు గదా ! అందువలన నిందు బంధింపబడి యుండుటకన్న మిన్నయగు బాధ నాకు మీరు కల్గించుచున్నారు. మనమున ప్రతిఫలితరాజసేవా పరిక్లేశభయము నాకు నితాంతము గల్గుచున్నది.


మ. భయదామాత్యదృగర్చిషాగ్నిముఖియై ద్వార్థ్సాగ్రహోదగ్ర వా
     క్బయ ఫేత్కారియునై, నియోగికసనోద్యత్తీవ్రసత్క ర్తికన్‌
     నియతిన్‌ సేవకశష్కశల్యవితతిన్‌ వే దాల్చుచున్‌ రాక్షస
     క్రియ నేప్రాణినిరాజసేవ విడచున్‌ గీడెంచకుండన్‌ భువిన్‌.

కావున నో సుధీమణీ ! నన్ను వదలిపెట్టము. విహంగమకుటుంబమునుండి నన్ను వేరుచేయకుము. నికుంజతరుకోటరకుటీరావాససౌఖ్యమునకు దూరము జేయ కుము. యదృచ్చారామఫలరసోపభోగమునుండి తప్పింపకుము. వివిధవనసరణి సంచా రమునుండి తొలగింపకుము. సభస్థలోత్పతనవిలాస వైభవము శూన్యముగ జేయకుము. అనాధను, ఆర్తురాలను పతత్రిమాత్రమనని దుఃఖాతిశయిమున నిక మాటరాక యూర కుండెను.