పుట:కాశీమజిలీకథలు-12.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఆ మాటలు విని నేను మైమరచి యవి శుక్రపోక్తములని యెరుంగక యొకానొక వ్యక్తి ప్రగల్భ వచనములుగ మొదట సంశయించి పిదప నిట్లు తలంచితిని. స్వార్ధవిషయికములగు దీని వచనములకు నేనును స్వార్ధము ననుసరించి ప్రత్యుత్తర మొసంగ జూచితినేని యిది మంచిమాటలచే నా హృదయమును దయార్ద్రం బగు నట్లొనరించి మనస్సును సహేతుక ప్రశ్నోత్తరముల న్వవశముగ జేసికొనగలదు. ఈ శకుంతచతురవచనములకు లోబడి పంజర బంధమునుండి తప్పించితినేని ప్రభువునకు దీనిని సమర్పించి మనఃప్రియం బొనరింప సమకట్టిన నా ప్రయత్నమెల్ల వ్యర్థము కాగలదు. దీని నెట్లయినను స్వామిసన్నిధికి గొనిపోవలయును. ఈ చిలుక వృత్తాంతమెల్ల ప్రభుసమక్షముననే వినెదంగాకయని నిశ్చయించుకొని దానిమాటల కేమియు బత్యుత్తరం బొసంగక యూరకుంటిని.

ఇంతలో శుకాలాపభయపలాయితుండైన హాలికుని వెన్నంటి పోయిన తిమిరకేశ పిశాచమువలెనే యా రాత్రి గతించెను. తెల్లవారె నింక చిలుకం గొని తెమ్మని నన్ను ప్రబోధించు తెరుంగున నిశోపాంతమందు మేతకై విడువబడి తిరుగు చున్న పశులమెడల నవలంబించియున్న కాష్ఠఘంటా నినాదము నా చెవులంబడెను నే నెప్పుడత్యంత సంతోషమున లేచి యదియ తగినసమయంబని తలంచి యా శుకముం గొని యందుండి బయలుదేరి యాదినాంతమునకు నందావటనగరము జేరుకొంటి. అంతవరకు నా జాడ దెలియక తహతహంబడుచు నారాక నెరింగినతోడనే ససంభ్రమ ముగ నెదురు వచ్చిన పరిజనుని చేతికా పంజరమిచ్చి దాని వృత్తాంతము వానికి సంగ్రహముగ జెప్పుచు విడిదెకుం బోయితిని. ఆ యద్భుతశకుంతమును దేవర కెప్పుడు చూపింతునను నుత్సాహముతో దానికి వేఱొక మణిఫలకపంజరమును నిర్మింప జేసి యా రాత్రి యందు విశ్రమించి నే డిచ్చటి కేతెంచితిని. ఇట్టి విహంగ రత్నము భూమండలాఖండలుండగు మహారాజు సమక్షమునం దుండిన మిగుల శోభింపగలదని దలంచి మద్గృహంబునకైన బోవక తిన్నగా నేలినవారి సమక్ష మునకే దానిం దోడ్కొని వచ్చితిని. అయ్యది ద్వారప్రదేశమున దారకునిచేతియందు న్నది. ముదలయేని గొనివచ్చెద, పిమ్మట దేవరచిత్తమే ప్రమాణమని యూరకుండెను.

ఆ పలుకు లాలించి రాజు విస్మయావేశహృదయుడై సత్వరమా శుక శ్రేష్టముం గొనితెమ్ము విమర్శింతమని యానతిచ్చెను. తోడనే వసంతశీలు డతివేగ మున ద్వారదేశమునకరిగి రత్నపంజరముతో నా చిలుకను స్వయముగా దెచ్చి రాజు మ్రోలను విడచెను. అప్పుడా చిలుక మెడయెత్తి ప్రసన్న దృష్టులా ఱేనిపై బరపుచు వాని నుద్దేశించి యిట్లనియె దేవా ! హరనయన హుతాశన శిఖాదందహ్యమానుండగు కుసుమాయుధునిచే విడువబడిన రూపమును, నహల్యాభిసరణ విషణ్ణుండగు శతమన్యు నిచే గోల్పోబడిన విలాసమును, పాల్కడలి నురగతల్పమున శయనసుఖవ్యసనపరా యణుండగు నారాయణునిచే విడువంబడిన భువనరక్షణవ్యాపారమును, నొక్కుమ్మడి