పుట:కాశీమజిలీకథలు-12.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని కథ

139

విశేషములు వానికి జూపుచుఁగ్రమమున భూలోకమున కేతెంచెను. అందుఁగల పుణ్య తీర్థములెల్ల వానికిఁ జూపించుచు వానివానివిశేషముల సంగ్రహముగా నెరింగించుచు జివు రకు భారతవర్షమున దక్షిణాపథమున నున్న పావనగోదావరీ సరిత్తీరమునకేతెంచి యమ్మ హానదియందుఁ గృదస్నాతులై తీరమున‌ కేతెంచుచున్నసమయమునఁ బ్రాంత మందు జనుల కోలాహలము వినంబడెను.

దానికి వారు వెరఁగందుచుఁ జూచుచుండ నొకదండనుండి వేదండంబొం దతిరయమున వారున్న వైపునకు వచ్చుచుండెను. దాని ననుసరించి యపరమిత సేనాసము దయం బరుదెంచుచుండెను. ఆ వేదండంబు తిన్నఁగాఁ బుండరీకుండున్న చోటి కేతెంచి నిజశుండాదండం బెత్తి యందమరింపబడియున్న మణిహారమాపుండరీకుని మెడలోవై చి యతిసంతోషసూచకముగ ఘీంకారమొనర్చుచు వానిచుట్లుఁ దిరుగుచుండెను. ఇంతలో వెనుకవచ్చుపరివారము జయజయనినాదములతో సమీపించిరి. ఈయద్భుతసంభవమును గాంచి నారదమునిచంద్రుడు మందహాసమొనరించుచుండెను. అమ్మణిహారప్రశో భితుండగు పుండరీకుండు పుండరీకాక్షు ననుసరించుచుండెను. అప్పుడు రాజపరివారము నుండి ప్రధానామాత్యుండు సకలరాజచిహ్నమాలంగైకొని ముందునకు వచ్చి పుండరీకు నాశీర్వదించుచు నిట్లనియె.


ఉ. కుంతలభూపుఁడీల్గగఁనె కొంకక నింకొకయోగ్యుఁ బట్టపుం
    దంతియెరింగి గోర్చుట విధాయక మీయెడఁ గావునన్ గరా
    భ్యంతరసంగృహీతమణిహారముతో నరుదెంచి నిన్నె భూ
    కాంతునిగా వరించెఁ గడకన్‌ గరిరాజిజ మాటలేటికిన్‌.

కుమారా ! నీ మొగమున సర్వవసుంధరా రాజ్యరమా సమోప భోగార్హము లగు చిహ్నంబు లనేకములు పొడఁగట్టుచున్నవి. నీ రూపము త్రిభువనాసేచన కముగ నెగడియున్నది. నీ యాదేశానుసారముగ‌ మే మెల్లరము మెలంగఁగలము. అసమశోభావిభూతిచే నతిశయిల్లు ప్రతిష్టానపురమందు భద్రసింహాసనా రూఢుండవై యీ కుంతలరాజ్య పరిపాలనం బొనర్పుము. నృగసగరభగీరధాధియాదిమ భూపాలకుల కీర్తివిత్తాపహర్తవై పయోధిపులినసంక్రాంత విక్రమక్రముండనై విపక్షభూపాలసంపదాప హర్తవై ముజ్జగములచేఁ కొనియాడఁబడుచుండుమని దీవించుచు నామరిత్రిముఖ్యుండు రాజోచిత వస్త్రాభరణము లప్పుండరీకుని మ్రోలఁబెట్టెను.

నారదమునీంద్రుని యాదేశమునఁ బుండరీకుండు సకలరాజ చిహ్నముల ధరించి యపరపుండరీకాక్షునివలెఁ బ్రకాశించుచుండెను. పిమ్మట నయ్యుపవాహ్యము నధిష్టించి మహావైభవమునఁ బ్రతిష్టానపుర ప్రవేశంబొనరించి యందు రాజభవనమున విడిచి శుభ సమయమున మంత్రి సామంతహిత పురోహిత ప్రముఖ ప్రకృతివర్గము బరివేష్టింపఁ గుంతలరాజ్య సింహాసనాధిష్టితుండయ్యె. ఇట్లుండ నొకనాఁడు నారధుం డేకాంతగృహమున నప్పుండరీకునితో నిట్లనియె.