పుట:కాశీమజిలీకథలు-12.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నార -- మహాభాగ ! ఈ కుమారులిర్వురును భవదీయ శిష్యులు గావల యును. శాస్త్రములెంతవరకు పఠించిరి?

శ్వే - పుండరీకుడను నీ బాలకుండు నా పుత్రుండు. రెండవవాడు విద్యా భ్యాసమునకై వచ్చియున్నవాడు. వీరు సర్వశాస్త్రముల బఠించిరి. కోరికగలదేని యేదైన బ్రశ్నింపవచ్చును.

నార -- ప్రశ్నింపనగత్యములేదు. శాస్త్రములన్నియును వీరి ముఖముల యందు బ్రతిఫలించుచుండెను. కాని యొక్కసందియము గలదు. ఆగ్రహము రాకున్న దెలియబల్కెదను.

శ్వే - ఆగ్రహమేల ? నీ సందియము తప్పక తీర్చుకొనవలసినదే!

నార - మహాత్మా ! బ్రహ్మచర్యదీక్షచేఁ బ్రసిద్దికెక్కియున్న నీకీపుత్రకుం డెట్లు గలిగెనో వినఁగుతూహలమగుచున్నది. నెరుంగఁ దగినఁ జెప్ప బ్రార్దించెను.

శ్వేత - ఆ వృత్తాంతము గొంత గూఢమైనది కాని నీసందియము బాపుటకై ప్రధానాంశమునుమాత్రము జెప్పెద వినుము. మందాకినీతీరమునఁ బుండరీకమధ్య మందు నాకీబాలకుండు లభించెను. కావుననే వీనికి పుండరీకుఁడను పేరుపెట్టితిని. వీని నప్పటినుండియును బుత్రప్రాయునిఁగా నీయాశ్రమముననే పోషించుచు విద్యాబుద్ధుల గరపితిని.

నార -- బాగు బాగు. ఈ కుమారుని ముఖమునఁ ద్రిభువనములఁ బాలింపఁ దగు చక్రవర్తిలక్షణములు బెక్కులు గనిపించుచున్నవి. వీని‌ నీయాశ్రమమున ముని వృత్తియందుంచుటకన్న లోకసంరక్షణమునకు వినియోగించుట యుచితమని నా తలంపు. మీద మీ చిత్తము.

శ్వేత -- ధనుర్వేదమందుఁగూడ నితండు గుశలుఁడయ్యెను. కాని పరిశ్రమ కొరవడియున్నది. అందులకై వీని నెచ్చటికైనఁ బంపవలెననియే నేనునుఁ దలంచు కొంటిని.

నార -- అట్లయిన వీని నావెంటఁ గొనిపోయి ధనుర్విద్యాపరిశ్రమమున కనువగుచోట శిసుక్షితునింజేయించెద ననుజ్ఞ యిప్పింతురే యని యడుగుటయు శ్వేత కేతుం డందుల కానందించి పుండరీకుని వానితోఁ బంపుటకు సమ్మతించెను.

ఆ దేవమునీంద్రుండు శ్వేతకేతునాశ్రమమునఁ నాదినముగడిపి మరునాఁడు పుండరీకునిఁ దోడ్కొనిపోవనున్న సమయమునఁ గపింజలుఁడుగూడ వారివెంటఁ బయన మయ్యెను. కాని వానితలిదండ్రుల యనుమతము బడయకుండఁ తమవెంటఁ దీసికొని పోవుటకు నారదుం డంగీకరించలేదు. కపింజలుండును బుండరీకునియందుఁ దనకుఁ గల మైత్రివలన వాని నెడఁబాసియుండఁజాలక తన తల్లిదండ్రులయనుజ్ఞఁ గెకొని వెంటనే వచ్చెదననిజెప్పి యందుండి వెడలిపోయెను. అప్పుడు నారదుండు శ్వేతకేతు ననుజ్ఞఁ గైకొని పుండరీకునితో నటఁగదలి సకలదేవతాలోకంబులఁ దిరుగుచు నందలి