పుట:కాశీమజిలీకథలు-12.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని కథ

137

కని పలికెను. పిమ్మట తమ యవినయంబుకతంబున బుట్టిన యనర్థముల విని యహల్యాతారా రమణులు మిగుల విచారించిరి వారి నుచితరీతిని ననునయించి నార దుండు యధేచ్ఛాగతింబోయెను. పిమ్మట నెల్లరును నిజనివాసముల కరిగిరి.

323 వ మజిలీ

పుండరీకునికథ

దేవలోకమున శ్వేతకేతుండను మహాముని కలడు. అమ్మహానుభావుండు దివిజగంగాసరి త్తీరమున నాశ్రమము గల్పించుకొని తపంబాచరించుచుండెను. ఒక్కనా డమ్మునిముఖ్యుండు మందాకినీ స్నానంబొనరింపగనేగి యందలి వికసిత సరోజాతముల దేవపూజకై కోసి తెచ్చుట కా జలంబులందిగెను. ఆ సమయమున గమల వనమున సన్నిహితయై వేయిరేకుల తమ్మిగద్దియపై గూర్చుండియున్న లక్ష్మీదేవి యామౌనిసత్తము నీక్షించి గౌతమశాపమూలమున జిత్తచాంచల్యము నొందెను. దర్శన మాత్రముననే సమాగమసౌఖ్యంబందిన యామెకు సద్యోగర్భమున నప్పుండరీకమందు పుత్రోదయంబయ్యెను. అప్పు డద్దేవి యా పుత్రకు నెత్తుకొనివచ్చి మునీంద్రా ! వీడు నీ తనయుండు. వీనిం గ్రహించి సంరక్షించుకొనుమని వచించి యబ్బాలకు నా శ్వేత కేతుల కొసంగెను. పుత్రసంభవము మాత్రముననే యామెకు శాపాంతమగుటయును జరిగినదానికి మనమున లజ్జించుకొనుచు నా శ్రీదేవి యంతర్హి తురాలయ్యెను.

పిమ్మట శ్వేతకేతుండు తనూజలాభమున కంతరంగమున సంతసించుచు నబ్బాలకుని నిజాశ్రమమునకు గొనివచ్చి పుండిరీకమున సంభవించిన కారణమున వానికి పుండరీకుడని నామకరణం బొనర్చెను. అబ్బాలకుం డమ్మునీంద్రుని సంరక్షణావిశేష మున దినదిన ప్రవర్థమానుండగుచుండెను.

దేవలోకముననే యొక మునిదంపతులకు గౌతముడు శాపమూలమున గపింజలుండును పుత్రుడై జన్మించెను. వానిని తలిదండ్రులుపనీతులొనర్చి విద్యా భ్యాసంబునకై శ్వేతకేతునియొద్దకు బంపిరి. పుండరీకునితో సమవయస్కుండగు నాకపింజలుని దన యాశ్రమమునందే యుంచుకొని పుత్రునితో వానికి సకల విద్య లను నేర్పుచుండెను. పుండరీకకపింజలు లత్యంతమైత్రి గలిగియుండిరి. ఉపదేశికుని ప్రభావమున నబ్బాలకు లచిరకాలముననే సర్వశాస్త్రముల యందును ప్రవీణులైరి.

ఇట్లుండ నొకనాడు నారదుండు శ్వేతకేతుని యాశ్రమమున కేతెంచెను.. అందా బాలకుల నిరువుర నీక్షించి మందహాస మొనరించుచు నమ్మునిపుంగవునితో నిట్లనియె.