పుట:కాశీమజిలీకథలు-12.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

లంకారభాసురులై లక్ష్మీనారాయణులు సభాస్థలంబులకు విచ్చేసి అందున్న వారికెల్లఁ గనుల పండువయొనర్చిరి. పురోహితుండగు బృహస్పతి యంతవరకు రాకుండుటచే నా దేవసభయందుఁ గొంత కలవర ముదయించినది. తక్కినవారు రాకుండుట గూడ నెరింగి యెల్లరును విస్మయసందేహడొలాయమాన మానసులై వారికై యెదురు చూచు చుండిరి.

ఇంతలో నారదుండు పరుగు పరుగునవచ్చి హతాశులమైతిమి. అనల్పమగు ప్రమాదము సంభవించెను. నేఁటి యుత్సవమున కంతరాయము గల్గినదని పల్కుచుఁ జేరువనున్న యాసనమునఁ జదికిలంబడెను. వానిమాటల కెల్లరును నాశ్చర్యభయవశం వదులైరి. అప్పుడు కశ్యపుఁడు నారదుని సన్నిధి కేతెంచి యిట్లనియె.

కశ్య - నారదా ! నీ మాటలు జాలభయవిషాదములఁ గలిగించుచున్నవి గదా ! నేఁడేమి ప్రమాదము సంభవించినది ? ఈ యుత్సవమున కేమియాటంకముద యించెను ? గౌతమబృహస్పతు లిందు రాకుండుటకు గతంబేమి ? ఇంద్రచంద్రు లేమైరి? సత్వరమ యధార్థ మెరెంగింపుము.

నారదుడు - ఆర్యా ! వారు నేఁడు మహాక్రోధాభిమానులై యున్నారు. అనర్ధము రాకమున్నే ప్రతీకార మాలోచింపవలసి యున్నది.

కశ్య - జరిగిన వృత్తాంతమెల్ల సవిస్తరముగా నెరింగింతువుగాక. ఊరక కాలయాపనమేమిటికి ?

నార -- నేఁడు శ్రీదేవిం దర్శింప మునిపత్నులెల్లరును నామె సమక్షమున కేగిరి. అందాలోకమాతచే నహల్యాతారారమణు లవమానింపబడిరఁట. వారిరువురును దమ విడిదెలకరిగి విచారమానసులై యెవ్వరితోడను బలుకక తలగట్టుకొని పరుండిరట. అందులకుఁ దహతహంబడుచున్న భర్తలతో నా ముద్దుగుమ్మలు శ్రీదేవిపై లేనిపోని నేరము లెన్నియో చెప్పిరఁట. దానికై యాముని యుగ్మము మండిపడుచుండెను. ఇంద్ర చంద్రులు సన్నిధినుండి వారి క్రోధాగ్నినిఁ దమ యవినయప్రసంగమునఁ బ్రజ్వలింప జేయుచుండిరి. వారి కోపమూలమునమ్మహాలక్ష్మి కేమియిక్కట్టు సంభవించునో యను భయంబున నీ యుదంతము మీకు నివేదింప నే నిందేతెంచితిని. మీద మీరలె యాలో చింపఁ గర్తలని మిన్నకుండెను.

ఆ మాటలాలించి చేరువనున్న నిటలాక్షుండు క్రోథతామ్రాక్షుడైఁ యందున్నవారెల్ల భయకంపితులగునట్లు చంద్రదేవేంద్రుల నుద్దేశించి యిట్లనియె. ఏమి యీ యింద్రచంద్రుల యసమంజస ప్రవర్తనము ! సర్వలోకాధినాయకుండగు లక్ష్మీనారాయణునకుఁ బ్రియముగ నిందొనర్పవలసిన మహోత్సవము జూడ నిందరు దేవతలు మహర్షులు వచ్చి వేచియుండఁ దామెచ్చనో నిలచియుండుట హైస్యమని యేల వారికి దోపకున్నదో గ్రహింపఁజాలకున్నాను. ధూర్తజాయా ప్రకల్పిత మహామాయా వాగురాబద్ధహృదయ రాజీవులకు గౌతమబృహస్పతు లందుమసలిన మసలియుందురు