పుట:కాశీమజిలీకథలు-12.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

133

కుండుటచే నరజారుచున్నకొప్పునం దడవిపూవులం దురిమి ముకుదూల మూడునట్లు వ్రేలాడు నాసామణింబూని బొమ్మకు గట్టినట్లు చీరధరించి కొన్ని యనాగరకంపు నగల దొడిగిచూపుర కపహాస్యము గలిగించు వెసవములనున్న తక్కినముని పత్నుల వలె మనముగూడ నుండక శృంగారవేషముల నొప్పియుండుట యీమె కిష్టము లేకుండవచ్చును. దానికి మనమేమిచేయగలము ? పేదముదుసలి పేరంటాండ్రవలె నుండుమన్న మనమెట్లుండగలము.

లక్ష్మి -- [మందహాసముతో] మీ యిరువురును రహస్యసంభాషణమునకు బూనియుంటిరేమి ? మీ ముఖములు దిలకింప మాఫై నెద్దియో యలుకవహించుచున్నట్లు తోచుచున్నది. యధేచ్చగా మాటలాడుకొనుచున్న సమయమున నలుకబూనుట సమం జసముగాదు.

తార --- మహాభోగపరాయణుండై యనేక చిద్విలాసభాసురుండై యనిర్వచ నీయప్రభావసమేతుండై త్రిభువన జేగీయమానుఁడగు యొడయని జెట్టపట్టిన యదృష్ట శాలి సన్నిధికి విభూతిరుద్రాక్ష మాలికాధరులై యసదృశజటాకలాపభారులై యత్యంత‌ ఛాందస ప్రవృత్తులైయున్న భర్తలతోఁ గాపురము సేయచున్న మేము దగుదు మమ్మాయని యిందరుదెంచుట హాస్యాస్పదము కాకుండునా ?

అహల్య - (కోపముతో) వచ్చినందులకు మంచి పరాభవమే జరిగినది, ఇఁక మనమిక్కడ నుండబనిలేదు. వచ్చిన దారిబోయి చేతనయిన నిందులకు బ్రతీకార మాలోచించుకొందము రమ్ము. (అని తార చేయిపట్టుకొని బిరబిరలాగికొని యవ్వలఁ బోయినది)

తక్కిన మునిపత్నులెల్లరును జరిగిన దానికి మనముల వగచుచు శ్రీదేవి యనుజ్ఞ గైకొని నిజనివాసములకు బోయిరి. రమాదేవియును నహల్యాతారాసతులతో దనకు నిష్కారణ కలహము సంభవించినందులకు నెమ్మనంబున నుమ్మలికము జెందుచు నంతర్గృహమునకు బోయెను.

ఇంద్రచంద్రులశాపము

నాడు యధానిర్దిష్టముగ వైకుంఠమున జరుగవలసిన వేడుకలు జేయ మొదలు పెట్టిరి. ఈశ్వరుడు గూడ పార్వతీసమేతముగ నాటి యుత్సవతిదృక్షాపేక్ష వచ్చి సభ నలంకరించియుండెను. ఇంద్రుఁడును జంద్రుఁడును దక్కఁ దక్కినదేవత లెల్లవచ్చి యర్హాసనముల నుపవిష్టులై యుండిరి. గౌతమ బృహస్పతులుగాక తక్కిన దివ్యమునీంద్ర సందోహమెల్ల నామందిరమున కేతెంచెను. కొంతసేపటికి యధోచితా