పుట:కాశీమజిలీకథలు-12.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

131

ణంబున నాట్యకళాప్రదర్శనం బొనరింతురు. ఇట్టివినోదముల నాడా వైకుంఠమందిరం బెల్ల నత్యంతసోభాయమానమై చెలగియుండును. నాడు లక్ష్మీనారాయణసందర్శనము సర్వపాపహరం బనియును నిఖిలభయ విధ్వంసకంబనియును వివిధహృదయోపతాప నివారకంబనియును శాశ్వతమోక్షసామ్రాజ్యలక్షీ సముపలబ్ధసాధకంబనియును ననేక విధముల దలంచుచు భక్తసందోహమా వైకుంఠమందిరద్వార ప్రదేశమున గుమిగూడి యుండును.

అట్టి యుత్కృష్టోత్సవదినమున కొకప్పుడు దేవతలు మునీశ్వరులును నేతెంచి యా వైకుంఠపురమున విడిసియుండిరి. మునిపత్నులెల్లరును సముచితరీతి నలంకరించుకొని‌ శ్రీదేవిం దర్శింప ముందుగా నా మందిరమునకరిగి తమరాక పరి చారికా ముఖమున దెలియజేసిరి. రమాదేవి యా వార్త విని ముప్పిరిగొను సంత సమున నమ్ముని పత్నుల కెదురేతెంచి యభ్యంతరమునకు గొనిపోయి వారినెల్ల నర్హ రీతి నాదరించెను. గౌతమసతియగు నహల్యయును నాచార్యుని భార్యయగు తారాసతి యును సహజలావణ్యప్రశోభితములగు నిజాంగయష్టులకు నూత్నశృంగార మాపాదించు తెరగున వివిధభూషణభూషితలై మనోహరకుసుమవిసరసమలంకృత కేశ పాశలై సౌందర్యాబిమానసమంచిత ముఖసరోజాతలై యధేచ్చగా నానారీమండలమున మెలంగుట దిలకించి కలుములజవరాలు మనమున నించుక యేవగించుకొనెను. అన సూయను నరుంధతిని లోపాముద్రను మునిపత్ను లందరియందును మిక్కిలి గౌరవించి యామె పూజించెను. వారి సతీత్వమహత్వము బెద్దగా వినతించెను. అందువలన దక్కినవారి కించుక హృదయపరితాపం బొదవెను. సహజాభిమాన గర్వభూయిష్ట లగు నహల్యాతారారమణుల కందువలన నందరికన్న నధికముగ మనముల నీర్ష్య జనించినది. ఇట్టి యంతఃకరణప్రవృత్తులలో గొంత ప్రొద్దరిగిన వెనుక వారికిట్టి సంవాదము జరిగెము.

లక్ష్మి --- ఆర్యాణులారా ! మీ సందర్శనమున నా హృదయమునకు నే డపరిమితానందం బొదవెను. మీ చరిత్రములు సర్వప్రపంచ కాతీతములు. మీ మహి మలు మహాద్భుత సమేతములు. సకలభువనంబులును మీ మాటలకు వశంవదములై యుండు. ఇట్టి మీతోఁగలసి ముచ్చటించుట నాకు మహాభాగ్యము.

అనసూయ - దేవీ ! నీవిట్లు మమ్ము బెద్దసేసిపలుకుట నీ యభిమాన సూచకముగాక వేరెట్లగును ? సర్వ ప్రపంచ సంరక్షకుండగు నధోక్షజున కిల్లాలవై నిఖిలదేవతా చక్రవర్తివై యొప్పు నీ యెదుట మేమెంతవారము.

అరుంధతి -- తల్లీ ! నీచేఁ గొనియాడబడిన కారణమున మేము ధన్యుల మైతిమి‌. నీ కటాక్షరస సమప్రసారము మాత్రముననే నిరుపేదకైన సర్వసంపదలు గలుగునని వచింతురుగదా ? అట్టి లో కైక శరణ్యంబవగు నీతో ముచ్చటింపగలిగిన మా యానందమునకు నేడు మేరలేదు.