పుట:కాశీమజిలీకథలు-12.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

129

యించి మంచి ముహూర్తమున నిల్లు వెడలి భూలోకమునకు దపంబొనర్ప నేతెంచెను. అందు సువర్ణపురమున కుత్తరమున నున్న కెలాసగిరి పరిసరమున నిర్మానుష్యంబగు నరణ్యము తగిన స్థలంబని తలంచి యచట నొకవైపున నతిసుందరంబగు దేవమంది రముగట్టించి యందు ద్ర్యంబకుని బ్రతిష్టించి యావిరూపాక్షు సిద్దాయతనమునకు బూర్వ దిగ్భాగమున నచ్చోదంబను నతిమనోహరంబగు సరోవరమును జైత్రరధంబను నుద్యాన వనమును నిర్మించి యందు బెద్దకాలము దీక్షగా దపంబాచరించుచుండెను.

కొంతకాలమునకు వాని తపమునకు మెచ్చి పరమేశ్వరుండు పత్యక్షమై యభీష్టవరము గోరుకొనుమని యానతిచ్చెను అందుల కా గంధర్వసార్వభౌముఁడు మహానందకందళిత హృదయారవిందుడై తనకును హంసునకును సంతానముగలుగు నట్లు వరంబిమ్మని ప్రార్దించెను. అప్పు డప్పినాకపాణి వారిరువురకును జెరియొక పుత్రికయును బొడమ గలరని వరంబిచ్చి యంతర్హితుండయ్యె. పుత్రసంతాన మపేక్షించి తపం బొనరించుచున్న యాగంధర్వపతికి పశుపతివరము సంతోషమును గలిగింపదయ్యెను. అక్కారణమున జిత్రరధుండు చింతాకులస్వాంతుడై యిట్లని విచా రింపదొడంగెను. అన్నా ! మందబుద్ధినై చేతి కబ్బిన మహాభాగ్యము ననుభవింపజాల నైతినిగదా! అనన్యదుర్లభంబగు నీశ్వరసందర్శనభాగ్యం బబ్బినను మన్మనోగతము నీడేర్చుకొనజాలనైతిని. ఆ దేవోత్తముం డభీష్టవరము గోరుకొమ్మని యానతిచ్చి నప్పుడు పుత్రసంతానము గావలెనని స్పష్టముగ‌ వేడుకొనక వెంగలినై సంతానము మాత్రమే కోర దివురుట నాయభాగ్యత మూలమునగాక యితరమెట్లగును? అయ్యో! చేసినకృషియంతయును వ్యర్థమయ్యె గదాయని యనేకవిధముల విచారించుచున్న సమయమున నారదుండెందేనిబోవుచు నచ్చోటి కేతెంచెను. చిత్రరధుండు వానిరాక నెరింగి లేచి నమస్కరించి యధార్హ సత్కారము లొనర్చి జరిగిన యుదంతంబెల్ల నెరిం గించి యమ్మునితల్లజునితో మరియు నిట్లనియె.


సీ. తల్లిదండ్రులకు సద్గతి హేతువగువాఁడు
          తనయుండు జన్మమాత్రంబువలన
    కన్నవారికిఁ గీర్తిఁ గల్చించుఁ గొమరుండు
          వినయవివేక సద్విధులవలన
    పితరుల కతిమఃప్రీతిగొల్పు సుతుండు
          సరసవిద్యావివేషములవలన
    జననీజనకులకు సౌఖ్యంబుగూర్చు పు
          త్రకుఁ డుపచారపద్ధతులవలన.