పుట:కాశీమజిలీకథలు-12.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మించుగ నేక కాలమందే కలుగగలరు. వారు దేహములు వివిధములైనను నొక్కటి వలెనే ప్రవర్తింపగలరు. వారికి భర్తృసమాగమం బొక్కకాలమందే సంభవింపగలదు. మరియును వారు సంతానవంతులైన పిదప నేక ముహూర్తమందే దేహత్యాగ మొన రింపగలరు ఇంతకన్న నే జెప్పదగిన దెద్దియును లేదని మి‌న్నకుండెను.

అప్పుడు దేవవల్లభుండు నిజమిత్రునకు మనఃప్రియముగ నెన్నియో యనునయ వాక్యముల జెప్పి పుత్ర జననముకన్న బుత్రికా సంభవంబె జననీజనకులకు సర్వవిధముల సంతోషప్రదంబని వానిచే నొప్పించెను. మరియును వాని హృదయము రంజిల్లునట్లు నాడు బెక్కు వినోదములు నా దేవసభయందు జరిపించెను. పిమ్మట చిత్రరధుండును దేవేంద్రుని వలన ననేకరీతుల నాదరింపబడి వాని యనుజ్ఞగైకొని నిజ వాసమున కేగెను. కాని వానిమనంబున కూరట గలుగకుండెను. ఒకనాడు‌ నారదుడు యధేచ్చావిహారమున జిత్రరధు సాలి కేతెంచుటయును నతం డతనిచే బూజితుండై యర్హాసనంబున సుఖోపవిష్ణుడై యున్న సమయమున జిత్రరధుండు దన మనోవిచారం బెరింగించి పుత్రసంభవమున‌ కుపాయమానతిమ్మని ప్రార్ధింప నా దేవర్షి యిట్లనియె.

గంధర్వకుల చూడామణి ! దీనికై ప్రాకృతునివోలె నీవింత వలవంతబడుట సముచితమేనా ? పరమేశ్వరానుగ్రహమున బడయరాని దెద్దిగలదు? ఆ దేవుండు భక్తసులభుండని యెరుంగవా ?


సీ. కాలునిఁద్రోసి మార్కండేయునకు చిరం
            జీవనమిచ్చి రక్షింపలేదె ?
    హాలాహలము లీలఁగ్రోలి సురాసుర
            ప్రకరంబు బాధ దీర్పంగలేదె ?
    దివిజగంగా స్రవంతిని నౌదలభరించి
            భువి భగీరధు పూన్కిఁ బ్రోవలేదె ?
    త్రిపురదై త్యుల సంహరించి సుధాంధన
            కోటికానందంబు గూర్పలేదె ?

గీ. మఱియు నిజభక్తు లెందఱెందఱఁ గటాక్ష
    వీక్షణంబున హృదయసంప్రీతి నొసఁగి
    కాచి రక్షింపలేదె? యాక్రతువిరోధిఁ
    గొలిచి కోర్కెలందనివారు గలరె యెందు ?

కావున నా మహేశ్వరు నారాధించి యిష్టఫలసిద్ధిం బొందుము. ఇతర శంకల విడువుమని బోధించి యా మునివల్లభుం డెందేని బోయెను.

చిత్రరధుండును నీశ్వరారాధనమున దనకోర్కె యీడేర గలదని నిశ్చ