పుట:కాశీమజిలీకథలు-12.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


సీ. సంతోషమునఁ జతుష్షష్టిశక్తి గణంబు
          నామోదవృత్తంబు నభినయించె
    రవులులోలార్క కేశవఘటోల్కాదులు
          పన్నిద్దరు ప్రమోదభరితులైరి
    వనజాసనుఁడు నాల్గువదనంబులనుతించె
          వేదార్థముల భక్తివిశ్వనాధు
    గణనాయకులు శంఖకర్ణఘంటాకర్ణ
          నందిసేనాదులానంద‌ మొంది

గీ. రఖిలమాయాప్రయోగవై యాత్యగరిమ
   డుంఠి విఘ్నేశ్వరుండు వైకుంఠపతియు
   గమలవాసిని యను నేకకార్యపరత
   నాదివోదాసు వెడలంగ నడచునపుడు.

అనంతరము విదిత దివోదాసవృత్తాంతుండై యంతక మధనుం డంబికా యుతుండై ప్రమధులు దేవర్షులు దిక్పాలుకు గొలిచి వెంటరా గిన్నెరకింపురుష గరుడ గంధర్వ సిద్ధవిద్యాధరులు జయజయధ్వానము లొనరించుచుండ నందివాహనా రూఢుండై మందరమునుండి యానందమున నానంద కాననమునకు విచ్చేసి యవి ముక్తమంటపమున బేరోలగమునుండి డుంఠివిఘ్నేశ్వరు నాలింగనము చేసికొని పద్మ లోచనుని కరస్పర్శనం బొనరించి తక్కినవారినెల్ల నర్హ రీతి సంభావించెను. పుడమిపై వేలుపులుండరాదన్న దివోదాసుని శాసనము వానితో నంతమొందెనని దేవతలకెల్ల దెలియునట్లు బ్రకటించెను. పిమ్మట దనకు గాశీపురముపై గల మక్కువ నందున్న వానికెల్ల నెఱుంగ బల్కుచు మరియు నిట్లనియె. కాశీక్షేత్రధూళిత్రసరేణువు సర్వాంగ రక్షకము, కాశీనామసంస్మరణము సర్వపాపహరము, బ్రహ్మాండ గోళమునందున్న తీర్థరాజములెల్ల గాశీక్షేత్రమున బంచక్రోశమున నివసించియున్నవి. కాశీనిర్వాణ మాణిక్యఖని. కాశీ మోక్షలక్ష్మీ. నివాసకు శేయము. కాశీ సంసారబీజాంకురమరు భూమి‌. అట్టి కాశీక్షేత్రము నేటికి జేరగంటిమని యధికానందమున నా యంబికానాధుండు బెద్దగా నుతించెను. అందున్న దేవతాకోటురెల్లఱును దిరుగ దమకు గాశీనివాస వైభవం బబ్బినందుల కెంతయును సంతసించిరి.

గోపా ! వింటివా ! కాశీక్షేత్ర ప్రభావము అట్టి మహాక్షేత్రం బిక గొన్ని పయనములలో మనము చేరగలము. అందు భాగీరధీ నిర్మల స్రవంతియందఘమర్షణ స్నానం బాచరించి భక్తసులభుండగు విశ్వనాధుని సందర్శించి చరితార్థులగుదుమని నుడి విన మణిసిద్ధున కభివాద పురస్కరంబుగా నగ్గోపాలుం డిట్లనియె.