పుట:కాశీమజిలీకథలు-12.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

121


    యేమిచేయువాఁడ నెక్క డికేగుచు
    నేది దిక్కు నాకు యెరుఁగఁ జెపుమ.

నా భాగ్యముకతమున నీవు హితోపదేశం బొనర్ప నాచార్యుండునుంబోలె నేఁడేతెంచితివి. ఇంతకాలము నా రాజ్యమున నకాల మరణములును జరావ్యాధిదారిద్ర్య ములునులేవు. ఇప్పుడేమి కారణముననో యవి గలుగుచున్నవి. మరియు నరిష్టసూచ కములగు నుత్పాతము లెన్నేని యిప్పురమునఁ బొడముచున్నవి. దేవతలఁ దృణీకరించిన యొక్క యపరాధము దక్క నేనింకేదోసము నెరుంగను. ఇది యంతయును వేల్పులచేఁ గల్పింపబడిన కపటనాటకముగాఁ దోచుచున్నది. ఏది యెట్లయినను బెద్దకాలము రాజ్యం బొనరించితిని. రాజభరాక్రాంతుడనైతిని. ఇంద్రియములు విరతిం గోరుచున్నవి. ఇఁక సకల కర్మనిర్మూలన క్షమంబగు మోక్షంబపేక్షించుచున్నాఁడను. అమ్మహోపదార్థము నాకేయుపాయమున సిద్ధింపఁగలదో యానతిచ్చి నన్ను ధన్యునిం జేయుఁడని ప్రార్థించు రాజేంద్రునకు బ్రాహ్మణ వేషధారియగు హృషికేశుం డిట్లనియె.


గీ. కాశికాపట్టణంబున లింగప్రతిష్ట
    యాచరింపుము కల్పింపు హర్మ్యరేఖ
    బొందితోడన శివలోకమునకు నరిగె
    దనఘ ! నామాట వేదతుల్యంబుసుమ్మ.

నీ తనయునకు రాజ్యపట్టాభిషేకం బొనర్పుము. వానికి దైవభక్తి నుపదేశిం వుము. రాజ్యభారము పుత్రుని యౌదలంబెట్టి తపోవనమున కరుగుటయే వార్థక్యమున రాజు సేయఁదగిన కృత్యము. నేను చెప్పి నట్లొనర్తువేని నీవు కృతకృత్యుండవగుదువని చెప్పి యప్పుడే యా బ్రాహ్మణుం డెక్కదికేనియుం బోయెను.

దివోదాసుండును నైహికవిరక్తుండై యమాత్యుల మండలేశ్వరుల నధ్య క్షులఁ బురోహితులఁ బ్రతీహారులఁ గణకుల రాజపుత్రుల బ్రాహ్మణుల నంతఃపురజన ముల రావించి కుమారు సమరంజయు నందఱకు నప్పగించి యతనికి దారుణీరాజ్య పట్టాభిషేకముచేసి కాశికా నగరము నందుఁ దన సర్వశ్రీసమృద్ధియు వెచ్చించి మహా ప్రాసాదము నిర్మించి యందు శివలింగము బ్రతిష్టించి కింకిణిజాలమందితంబైన దివ్య విమానమెక్కి శరీరముతోడ శివలోకమునకుం జనియే‌ ఆ ప్రాసాదము సర్వశ్రీ సమృద్ధి వినియోగనిర్మితము గావున భూపాల శ్రీయనఁబ్రసిద్ధిగాంచెను. దివోదాసేశ్వరలింగము గాశీపట్టణమున భుక్తిముక్తిప్రదాయకంబై నేఁటికిని బ్రకాశింపుచుండెను. పిమ్మట మందర ధరణి థరమున నున్న పినాకపాణి కా వృత్తాంతమంతయును మురమధనుండు గరు డుని మూలమునఁ దెలియఁజేసి సత్వరమే వారణాశికి రమ్మని ప్రార్ధించెను.