పుట:కాశీమజిలీకథలు-12.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యనుపేరు వహించి పరివ్రాజకావేషధారియగు విషధికన్య యుపన్యాస చాతుర్యంబొప్ప నొప్పులకుప్పల సన్నిధి నిట్లని యుపన్యసింపఁ దొడంగెను.

మానినీమతల్లులారా ! పరబ్రహ్మం బానందస్వరూపంబని యందరెరింగినదే కదా ! ఏపనివలన మనమున కానందంబొనగూడునో యట్టివానినొనర్చుట కితరులకై వెరువనేమిటికి ? పాంచభౌతికమగు మన శరీరం బొకఁడు సౌభ్యార్థియై యాచింప నొసంగకుండుట సమంజస మగునా ? చనిపోయినపిమ్మటఁ జీమలును గాకులును గుక్క లును దిను నీదేహమును బ్రతికియన్నప్పు డొకఁడు ప్రార్థించిన వెంటనే యొసంగుట కన్న మిన్నయగు దాన మున్నయదియా ? అత్యంతప్రియతమమగు శరీరమును దాన మిచ్చుట నిక్కముగ దాతృత్వలక్షణము. వావివర్ణముల విచారింప నగత్యము గని పింపదు. దక్షుఁడును మరీచియును బ్రహ్మపుత్రులేగదా ? మరీచినందనుండగు కశ్య పుఁడు దక్షునికన్యకలఁ బదుమువ్వుర నెట్లు వివాహమయ్యెను ? పరమపురుషుని ముఖ బాహూరు పాదములయందుఁ జాతుర్వర్ణ్యం బుత్పన్నం బయ్యెంగదా ? ఒక్క తనువు నందు జన్మించిన నలువురు నేకోదరులగుదురో కారో మీరలే‌ విచారింపుఁడు. అట్టివారికి భిన్నవర్ణత్వమెట్లు సిద్ధింపఁగలదు. కావున వర్ణావర్ణ విచక్షణము విడచిపెట్టి యిచ్చ వచ్చిన మచ్చున స్త్రీపురుషులు విహరించుటయే పరమధర్మంబని పెద్దగా నుపన్యసింపఁ బురాంగనులకు భర్తృశుశ్రూషాది ధర్మముల విముఖత్వము గలుగఁదొడంగినది. ఇట్లు బుంరీకాక్షుండును వానియిల్లాలును వాడవాడలకుఁ దిరిగి యుపన్యసించుచుండఁ గొన్ని దినములకు -


గీ.‌ వర్ణములు నాశ్రమంబులు వరుసఁదప్పె
    వేదములు నాగమంబులుఁ విన్నఁబోయె
    సౌరభంబులు గృష్ణపచ్యములుఁ జెడియె
    వృద్ధిబొందె నధర్మంబు విశ్వమందు.

ఇట్లుండ దివోదాసుండు డుంఠిభట్టారకుండుచెప్పిన విప్రుండెప్పుడువచ్చునో యని కనిపెట్టుకొనియుండ సరిగఁ బదునెనిమిదవ దివసమున మధ్యాహ్న కాలమున సుగతవేషధారియగు మధుసూదనుండు బ్రాహ్మణ వేషముదాల్చి రాజసన్నిధి కేతెంచి సముచితగతి నద్దివోదాసు నాశీర్వదించి‌ యతని కనుసన్న నా పన్న యున్న తాసనమునఁ గూర్చుండెను. అప్పుడు విఘ్నేశ్వరుండు రాజుహృదయమున నావేశించి యుండెను. వినాయకాధిష్టితుఁడగు భూపతి వైరాగ్యము వహించి యందున్న కపట బ్రాహ్మణు నుద్దేశించి యిట్లనియె.


గీ. బడలుపడితి రాజ్యభారంబు భరియించి
    పొడమె మదివిరక్తి భూసుపర్వ !