పుట:కాశీమజిలీకథలు-12.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

119

బాదోదక తీర్థం బయ్యెను. అచ్చట గృతకాలోచిత క్రియాకలాపుండై యప్పుండరీ కాక్షుండు -


గీ. త్రిపురకాంతల శీలంబు లపహరింప
    బద్ధవేషంబు గైకొన్న పోకలాడు
    జలజనాభుండు సుగతవేషము ధరించెఁ
    గాశికాప్రజ కులధర్మగతి హరింప.

తనకుఁ బుణ్యకీర్తియని పేరు బెట్టుకొని గరుత్మంతునకు వినయకీర్తియను నామముబెట్టి శిష్యునిఁగాఁ బరిగ్రహించి జ్ఞానకౌముది యనిపేరు లక్ష్మికిఁబెట్టి యామెం బరివ్రాజికంగావించి తాను శిష్యుడును నొక్కవంకఁ బురుషులఁ బ్రమోదింపఁగను గమలయొక్కతె నింకొక్కచక్కి చక్కెరబోండ్లఁ బ్రలోభింపఁగను సంకేతము లేర్ప రచుకొని వేరువేర తెరవుల నప్పుటభేదనముజొచ్చి యొక్కచో నెల్లరు వినునట్లు పుణ్య కీర్తి శిష్యుండగు వినయకీర్తి కిట్లుపదేశింపఁ దొడంగెను.

శిష్యా ! సర్వజీవులకును జననమరణంబులు స్వభావసిద్దములు. వానికి నియామకుఁ డొక్కఁడెందునులేఁడు కాలభేదంబునగాని బ్రహ్మ రుద్రాదుల బ్రదుకులు గూడ మనకుఁబోలె యస్థిరములైనవే గదా ఆహార నిద్రాభయమైధునాది సమస్త వ్యాపారము లెల్లరకును సమాన ధర్మంబులు కావున జీవులకు తారతమ్యంబు లెంచక సర్వభూత సమత్వమున మెలంగవలెను. చీమ దోమ నల్లి మొదలగు నల్పప్రాణుల యందున్నజీవుఁడు నీయందు నాయందునుగల జీవునికన్న యల్పుఁడు కానేరఁడు. కావున నహింసయే పరమధర్మము. సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. శరీర త్యాగమే మోక్షము. అహింసాత్సర్వభూతాని అని వేదములయందే చెప్పఁబడియున్నది. కాని యందే యజ్ఞయాగములఁ బశువిశసనం బొనర్పదగునని జెప్పఁబడియున్నది. ఇట్లు పరస్పర విరుద్ధమగు వేదంబు ప్రమాణంబు గానేరదు. అహింసకన్నఁ బరమ ధర్మంబు లేదు. హింసకుడు నిక్కంబుగ నరకయాతనలను నహింసకుఁడు స్వర్గసుఖంబులఁ బొందును.

దానంబులెన్నియున్నను నభయప్రదానంబునకు సాటికానేరవు. దాననే నాలాసిద్ధాంతశాస్త్రపారంగతులగువారు భీతున కభయ దానమును వ్యాధితున కౌషధ దానమును‌ శిశ్రూషునకు విద్యాదానమును నాకొన్నవాని కన్నదానమును దానములలో కెల్లఁ బ్రశస్తములని చెప్పుచుందురు. ప్రత్యక్షానుమానోపమానార్ధాపత్తి జ్ఞానములయం దింద్రియార్ద సన్నికర్షోత్పన్నంబై యవ్యభిచారియు వ్యవసాయాత్మకమునకు జ్ఞానంబు ప్రత్యక్షంబు ప్రత్యక్షజ్ఞానము సర్వజనులకు దేటతెల్లంబు గావున నెల్లరు ప్రత్యక్షం బవలంబించి యితరధర్మముల నన్నిటిని బరిత్యజింపవలయునని సుగతవాదంబు శిష్యు నకు బోధించుచు నా పట్టణమునఁ దిరుగాడుచుండెను. ఇంకొక్కొచక్కని విజ్ఞాన కౌముది