పుట:కాశీమజిలీకథలు-12.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

117

నదేవతాకములగు జన్నములెన్నేని జేయవచ్చునని పలుకుటయు నక్కుహనా బ్రాహ్మ ణుండు గటకటంబడుచు నిట్లనియె.

రాజోత్తమా ! విశ్వేశ్వరుండు లేకుండుటచే నీయవిముక్తక్షేత్రం బెంతేని చిన్నవోయియున్నది. ఆ వాసుదేవుఁడొక్కడు మాత్రమిందేతెంచుట కనుమతింపుము. తక్కిన వేల్పులు నే నొనర్చు జన్నమునకు రాకున్నను జింతలేదని బ్రతిమాలుచున్న వాని కానృపోత్తముం డర్దాంగీకార సూచకముగ మిన్నకుండెను. పిమ్మట నవ్విధాత దశాశ్వ మేధయాగములు సుప్రయోగములుగా నాహరించి బ్రహ్మేశ్వర దేవుం బ్రతి ష్టించి భాగీరదీ పశ్చిమతీరమునఁ జెలఁగియుండెను.

అచ్చట గౌరీశుండును గాలవిలంబము సైరింపఁజాలక నిజాంతర్గతమున నిట్లని చింతించెను. యోగినీబృందంబా యానందకాననమునకేగి తిరిగి రాదయ్యెను. వినస్వతుండు పూర్వవృత్తాంతమంతయు మరచి యందే నిలచియుండెను. అంభోజు సంభవుండును నందె కదలిని కంబంబయ్యె ఇంకఁ బరమవిశ్వాసనిధులగు ప్రమధుల నందుఁ బంచెదంగాక యని శంకుకర్ణ ఘంటాకర్ణ మహాకర్ణ గోకర్ణ తిలకర్ణ స్థూలకర్ణ మహాకాళ పింగళకాహళాది ప్రమధోత్తముల బహుమానపురస్సరముగా రావించి కాశీ వృత్తాంతంబరసి వచ్చుటకు బుత్తెంచుటయును వారతిరయమున నచ్చటికేగి యాక్షేత్ర మహాత్మ్యమున నిర్వచింప లేనట్టి యానందం బనుభవించుచు నభవు నాజ్ఞను మరచి యం దీశ్వర లింగంబులం బ్రతిష్టించి తదారాధనాతత్పరులై యన్యమెరుంగకుండిరి.

320 వ మజిలీ

మందరాద్రియందు బాలేందుకలాధరుండు కాశికరిగిన వారి వృత్తాంతము తిరుగ నెరుంగక చింతించుచు గజాస్యునిగూడ నందుఁ బంపువాఁడై వాని రావించి చేయవలసిన కృత్యమెల్ల బోధించి యచ్చటకు బంపించెను. వారణాస్యుండు వారణాసి కరిగి ప్రతిదిన మందనేక దుర్నిమిత్తములఁ గల్పించుచుఁ బౌరులకు మిగుల వెరపు గలిగించుచుండెను. తాను పురజనులలోఁ జేరి యా దుర్నిమిత్తములవలనఁ గలుగబోవు విపత్తు లెరింగించుచు వాని కుపశాంతుం బోధించుచు నందరకు బరమాప్తుండువలె నా కాశీమధ్యమున సంచరింపఁ దొడగెను.


సీ. కలలోనఁ బుట్టినకథలెన్ని యన్నియుఁ
          బూసగ్రుచ్చినయట్లు పొసగఁజెప్పు
    హస్తరేఖలుజూచి యాయుష్యమును భవి
          ష్యము తేట తెలవిగా నానతిచ్చు