పుట:కాశీమజిలీకథలు-12.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


గీ. చదువఁ బాడంగ నర్తింప సరసమాడఁ
    గథలు సెప్పంగ నగ్గింపఁ గన్ను లార్ప
    వీణవాయింపఁ బొగడంగ విరులుగట్ట
    నేర్చునట్టిది యొకరిత నితాత యొకతె.

ఈ రీతి నానావిధరూపములంగైకొని యా యోగినీ మండలము వారణాసీ పురమున విహరించుచుండెను. ఇంతలోఁ గాలవిలంబము సైరింపఁజాలక యయ్యంధ కారాతి కాశీనగరమందలి వృత్తాంతమరయఁ జండకిరణుని బంపనెంచి వానిని రావించి యిట్లనియె.

వాసరాధిపా ! కాశీవియోగతాపమున నామనమున కూఱటఁ గలుగకున్నది. ధర్మ మార్గయిక తత్పరుండగు దివోదాసుని నందుండి వెడలనడిపించుట కుపాయము దోపకున్నది. వాని నెట్లయిన ధర్మవిముఖునిం జేసినఁగాని మనపని సులభముగానేరదు. కావున నీవచ్చటికేగి వానియందెద్దియైన దోషమును నిరూపించవలయునని పలుకుటయు నయ్యుష్ణాంశుండు వానియానతి శిరంబునంబూని కాశికేతెంచి యాచకుఁడై, దూతయై, దీనుఁడై, కార్తాఁతికుఁడై, దృష్టప్రత్యయవాదియై, వదాన్యుఁడై, జటిలుఁడై, దిగంబరుఁడై, బ్రహ్మచారియై, యతియై, నానా ప్రకారవేషభాషా చేష్టా యంత్రమంత్రతంత్రమాయా ప్రయోగబలమున మెలంగుచుండెను. కాని యా రాజన్యచూడామణి యందు దోష మించుకయును గనిపెట్టఁజాలఁడయ్యెను. ఇట్లు విఫలప్రయత్నుండై సూర్యుండు మగిడి యీశ్వరు సన్నిధికేగుటకు మొగముజెల్లక యా కాశియందే పండ్రెండు మూర్తులం గైకొని యధివసించి యుండెను. కాశీవాసనిమిత్తముగా మనంబు లోలం బగుట వానికి లోలార్కుఁడను ప్రసిద్ధనామము గలిగెను.

అచ్చట మందరాచలమున సాంబుండు కాశీవియోగ వేదనాక్రాంత స్వాంతుండై తద్వ్యత్తాంతశ్రవణ కతూహలమున విధాతనమ్మహాపరేత నిలయమునకుం బంపనెంచి వాని రావించి యిట్లనియె.


ఉ. పోయెను యోగినీబలము పోయినపోకనె పోయెఁ బిమ్మటన్‌
    దోయజబాంధవుం డతఁడునుం దడసెంగడు నీరుచూడఁగాఁ
    బోయిన యట్టి తామరలపోలిక నందరుఁ గాశిజిక్కిరీ
    తోయము నీవు‌ వోద్రుహిణ ! తొల్లిటి వారలయట్లకాకుమీ !

అని పలుకు నెలసిగ దాలుపు నానతివడసి యక్కమలగర్భుండు వృద్ధ బ్రాహ్మణవేషమున దివోదాసుని పేరోలగమున కేతెంచి యాశీర్వదించి కాశీక్షేత్ర మున యజ్ఞము లొనర్చుటకు దనకనుజ్ఞ యొసంగుమని యా భూపతిని బ్రార్థించిన