పుట:కాశీమజిలీకథలు-12.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

113

యాంతరంగిక సచివుడై యొప్పియుండెను. దివోదాసుని కనంగమోహినియందు సమ రంజయుండను పుత్రరత్నము దొలిచూలు తనయుడై జన్మించెను. మరియు ననేక పుత్రపుత్రికా సంచయం బారాజేంద్రునకు దక్కిన కళత్రముల యందును గలిగెను.

పిమ్మట దివోదాసుడు నిర్ద్వంద్వ నిరవగ్రహ నిస్సపత్నంబుగా ధరణీ రాజ్యంబు బెద్దకాలంబు పరిపాలించెను.

319 వ మజిలీ

అట్లు సిరితో సంతతితో దివోదాసుండు వారణాశీపురమున బెద్దకాలము నివసించియుండి పుడమిని ప్రజానురంజకుడై పరిపాలింపుచుండెను. కాని‌ దేవత లప్పుటభేదనంబు జొచ్చుటకు మాత్ర మతడంగీకరించి యుండలేదు. కాశీవియోగ వేదనా దోదూయమానమానసులై వేల్పులు శచీకళత్రుం బురస్కరించుకొని యొక నాడు బృహస్పతి చెంతకరిగి తమ మనోవ్యధ తెరంగెరింగించి యద్ధివోదాసునకు రాజ్య పదభ్రంశనం బెవ్విధమున నగునో యానతిమ్మని వానిని గోరుకొనిరి.

అప్పుడా వాచస్పతి మందస్మిత సుందరవదనారవిందుడగుచు వారికిట్లనియె. బృందారక బృందంబులారా ! ఇందులకై మీరింత యలజడిం బొంద నేమనం‌గలను. మానవులు దివిజుల యాశ్రమము లేక గడియయైన మనఁగలరా ? అగ్ని దేవుని యాధా రము లేకున్న వారెట్లు భోజనపదార్థముల బచనము జేసికొనగలరు ? గాలి లేకున్న వారికెట్లూపిరాడగలదు. వరుణదేవుని యనుగ్రహమునగాదే భూమిపై వారికి జీవనము నిలుచుట గలుగుచున్నది ?


గ. అగ్నిమనలోన నొక్కరుడౌ నొకాఁడొఁ
   చేయ డే వాయుదేవుండు జెప్పిసట్లు
   వరుణుఁడెవ్వరివాడు ! మువ్వురునులేక
   నిముసమోర్తురె మర్త్యులు నిశ్చయముగ.

వరుణానిలాగ్నులు దమతమ శక్తులుపసంహరించి రేని పుడమిపై బిఠర పాకంబు సాగదు. దానంజేసి యోదనంబు పరిపక్వంబు గానేరదు. వైశ్వదేవ బలి హరణాది సత్క్రియాకలాపము లక్కారణమున గుంఠితములగును. హవ్యకవ్య క్రియాశూన్యులైన బ్రాహ్మణులు రాజునందు విరక్తులగుదురు. తక్కిన వర్ణముల వారును బ్రాహ్మణుల ననుసరింప గలరు. ప్రజానురంజనంబునంగదా రాజు రాజ్యము