పుట:కాశీమజిలీకథలు-12.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

చుట సమంజసమగును మనమెల్లరము నీక్షణమే యిచ్చటినుండి కాశికిం బోవుటకుఁ దగువెరవరయవలయునని పలుకుటయును నరిందముండు మందహాస మొనరించుచు నిట్లనియె.

రాజేంద్రా ! నేను యక్షలోకము నుండి తెచ్చిన దివ్యయానంబీ చేరువఁగల నుపవనముననే యుండెనుగదా ! దాని నధిష్టించి మనమందర మశ్రమంబున వార ణాశికిం బోవచ్చునని పలుకుచు నప్పుడే యతండు దివోదాసుని యనుమతమున నద్దివ్య యానంబునకై పోయి ముహూర్త మాత్రముననే దానిఁగొనివచ్చి వారి యెదుటనుంచెను. రాజేంద్రుండందుల కెంతయును సంతసించుచు నా శాంభవీదేవి గర్భాలయమునకు దేవకాంతలతోఁ గ్రమ్మరనేగి యమ్మహాదేవి దివ్యదర్శనం బొనరించివచ్చి యావిమాన మెక్కి తక్కినవారితోఁ గూడ వారణాశికింబోవ నందుండి కదలెను.

అరిందమునకుగల విమానమును నడపునేర్పుచేతనో దివోధాసధారుణీంద్రుని మనోబలము మూలంబుననో కాశీనగరవాసు లారాజమార్తాండు డతిత్వరితముగ నేతెంచ వలయునని యెదురు చూచుచున్న విశేషము వలననో దివోదాస రాజకంఠీరవుండెక్కి యున్న దివ్యయానము దృటిలో గాశీపురము జేరెను. దివోదాసుని యనుమతమున నవ్విమానమును దిన్నగా రాజమందిరములోనికి దీసికొనిపోయి యరిందము డందొక యుచితప్రదేశమున నా పెను. అందుండి దివోదాసుండు దిగిన తోడనే మంత్రిసామంత హితపురోహిత భృత్యవర్గంబెల్ల బరుగుపరుగున వానిసన్నిధి కేతించి మించిన యానం దమున రాజోచిత సత్కారముల గౌరవించిరి. ఆ రాజేంద్రుండు దేవకాంతల నంత ర్గృహమున కనిపి తనవెంట శబర బాలకుని దీసికొని యరిందమునితో బేరోలగమున కేగి యందు గొల్వుదీర్చి నిజకధాశ్రవణ కుతూహలులై యున్న సమస్త బంధుమిత్రుల కెల్ల నుల్లములు బల్లవించు విధమున దనవృత్తాంత మంతయు నుపన్యసించెను.

దివోదాసునిరాక రాకయుంబోలె సమస్త హితపురోహితామాత్య భ‌ త్య చకోర సంచయమునకెల్ల నాడమందానందం బొనగూర్చెను. పౌరులెల్లరును దమ యేలిక క్షేమముగ దిరుగ రాజధాని జేర గల్గుటకు సంతసించి యానాడు గొప్పపండుగ దినముగా బరిగణించుకొనిరి.

పిమ్మట దివోదాసుండు తొ ల్తింటి శబరులరావించి వారికి జరిగిన వృత్తాంత మెల్ల సంక్షేపముగా నెఱింగించి శబరబాలకుని జూపుచు ఇడుగో సర్పదష్టుడై మర ణించిన మీ బాలకుడు ! మానవదుర్లభంబగు దివ్యలోకమున కరిగి తిరిగి యిందు వచ్చి యున్నాడని పలుకుచు వారి కప్పగించెను. ఆ శబరబాలకని సన్నిధినున్న మందసము నిండ ధనము బోయించి దానితో సుఖంబున గాలక్షేపముసేయుమని పలుకుచు నా