పుట:కాశీమజిలీకథలు-12.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఇట్లు నితాంతభక్తి నాదేవిం బ్రస్తుతించుచు ననంగమోహిని పాదమూలమున నొడలెరుంగక పడియున్న జనకుని యవస్థగాంచి యామించుబోణి మిగుల విచారించుచు నిజకరద్వంద్వంబున నా యనఘునిఁబట్టి లేవనెత్తుచు నిట్లనియె. తండ్రీ! మీకిట్టి మనోవ్యధ సమకూర్చిన మహాపాపాత్మురాలనగు ననంగమోహిని దేవీప్రసాదమున మీ సమక్షమున కేతెంచియున్నది తిలకింపుఁడనియనుటతోడనే యాసరీనృప కులవరేణ్యుండు దిగ్గునలేచి యెదురనున్న పుత్రికారత్నమునుగాంచి మించిన యానందమునఁ గౌగలించు కొని కొండొక దడవేమియుఁ బలుకఁజాలకుండెను. అనంగమోహినియును చిర వియోగక్లేశమున వెండియుఁ బలుక నశక్తురాలై చూపులచేతనే తండ్రియందు దనకుఁ గల ప్రేమ దెల్లముసేయుచు వాని యక్కున వ్రాలియుండెను.

ఇట్లు కొంతతడవు వారు చిత్తరువులవలె యుండి క్రమమున హృదయో ద్రేక మడంచుకొనదొడంగిరి. అపుడు వాసుకి యనంగమోహినితో నిట్లనియె. తల్లీ ! నీవు మమ్ము బాసిపోయినది మొదలు నేఁటివరకు మేము బడిన హృదయ పరితాపము నకు మేరలేదు. ఈ త్రిభువనేశ్వరి యనుగ్రహాతిలేశమున నిప్పుడు నీవు నా కన్నులం బడి యానంద మొనగూర్చితివి. రక్కసుతో జిక్కి నీవు మనుష్యలోకమున హిమ వత్పర్వత ప్రాంతములకుఁ గొనిపోఁబడుటయు దివోదాస ధారుణీంద్రుండు నిన్నా నక్తంచరుని బారినుండి తప్పించుటక కథ నేనిదివరకే తెలిసికొని యెన్నఁటికైన మగిడి నా సన్నిధి కేతెంచఁ గలవను నాసతో నుంటిని. పిమ్మట నెచ్చటికేగితివి. ఇన్నిన్నా ళ్ళెచ్చటనుండి యిప్పుడిచ్చటికెట్లే తెంచితివి? దివోదాస పార్దివేంద్రుఁ డేమయ్యెను. నీ చరిత్రమంతయును జెప్పుమని యడుగుచున్న జనకునకు నిజకధావిధానమెల్ల సాను పూర్వకముగా నెరింగించి మరియు నిట్లనియె.

తండ్రీ ! నేనీ భువనేశ్వరి యాలయంబున కేతెంచుట నాకే వింతఁ గొలుపు చున్నది. నేనిప్పు డేలోకమునందున్నానో గ్రహింపఁజాలకున్నాను. ఇది నిక్కముగాఁ బాతాళమేయైన యెడల యక్షలోకము నుండి యిందేతెంచుట కడుంగడు విచిత్రము గదా ! భయమూర్చితురాలనైయున్న నన్నా మణిగ్రీవుండు దుష్టబుద్ధియై యెత్తుకొని పోయి యగ్గుహాంతరమునఁ జేర్చియుండును. అందుండియే గదా యీ యమ్మవారి యనుగ్రహమున నిచ్చటకుఁ బారిపోయి వచ్చితిని. ఎట్లయినను నేనిచ్చటి కేతెంచుటకు మణిగ్రీవుఁడే కారణమై నా కెంతేని యుపకారమొనర్చెను. ఇందులకు వానికేను నిక్క ముగఁ గృతజ్ఞురాలను. అని వచించుచున్న పుత్రిక పలుకుల కలరుచు నా సర్పవంశ ప్రదీపరుఁడు నిజవృత్తాంత మెరిగించి పిదప నామెను దీసికొని నిజనివాసమునకుఁబోయి యెల్లరకు నానందమును గలిగించెను.