పుట:కాశీమజిలీకథలు-12.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాతాళేశ్వరి కథ

107

అప్పుడు వాసుకి యచ్చటికేతెంచి భక్తిపూర్వకముగా నద్దేవి నర్చించి పిమ్మట యామె నుద్దేశించి యిట్లనియె.

జననీ ! నీయనుగ్రహం బెన్నటికైన నాపై గలుగకుండునా యని నిత్య మెదురు చూచుచు గాలము బుచ్చుచుంటిని. కాని నేఁటివరకు నీకించుకయును దయ బుట్టలేదు. నేనిట్లెంత కాల మోపికఁబట్టి యుండవలయును ! నా పుత్రికారత్నము నెడఁ బాసి యెన్ని దినములైనదోకదా ? ఇంతవరకు నా యనంగమోహిని జీవించి యుండెనా? ఎన్నఁడైన నా కన్నుల కా బాలికామణి గనంబడునా ? కలలోఁ బ్రత్య క్షమై యనతికాలముననే యనంగమోహిని కనంబడునని నీవానతిచ్చి యుండుటచే నేనిట్లు ప్రాణముల నిలుపుకొనఁ గలిగితిని. ఇఁక నాయాస తీరిపోయినది. ఎంతకాలము నిరీక్షించియున్నను నించుకయును బ్రయోజనము లేదనుట ధృఢమైనది. అనంగ మోహినింగాంచఁ గల్గుదుననునాసతో నిత్యమును నీ సన్నధికేనేతెంచి‌ పూజానమస్కా రము లొనరించుచుంటిని దీన నబ్బు సుకృతవిశేషమున ముందు జన్మమందైన నిట్టి విచారము నాకుఁ గలుగకుండునట్లు వరంబొసంగుము. ఇదియె నా కడపటి కోరిక. నాకిఁకఁ మనుగడయందు రోత బుట్టుచున్నది నీ సమక్షమందే ప్రాణత్యాగం బొన రించి ధన్యుడనయ్యెదనని పలుకుచుఁ గృపాణపాణియై నిజమస్తకమును నరకుకొనుట కుద్యమించుచుండెను. దేవీవిగ్రహము వెనుకనున్న యనంగమోహిని యిది యంత యును గమనించుచునే యుండుటచేఁ దటాలున బయటికివచ్చి తండ్రి చేయి పట్టుకొని యెత్తిన కత్తిని లాగిపారవైచెను. వాసుకి యెదుటనున్న తనూజను హృదయోద్వేగం బున గురుతు పట్టజాలకఁ తన మరణోద్యోగమును మాన్పించుట కాయమ్మవారే యందుఁదనకు ప్రత్యక్షమైనదని తలంచుచు నామె మ్రోల సాగిలంబడి భక్తితత్పరత్వం బున నిట్లని వినుతింపఁ దొడంగెను.

దండకము

శ్రీమన్మహాదేవదేవీ ! భవానీ ! త్రిలోకైకమాతా ! కృతార్థుండనై తిన్‌. భవద్దర్శనంబబ్బె నాకిందు నేనెంత పుణ్యంబునన్‌ బూర్వ జన్మంబునం జేసియున్నానో మున్నెన్నఁడెవ్వారునుం గాంచలేనట్టి యుత్కృష్టయోగము నీప్రేమచేఁ గల్గె నా కిప్పుడో సర్వలోకేశ్వరీ ! శాశ్వతానంద సంధాయినీ ! నీ సమీపంబునన్‌ బ్రాణముల్‌ బాయగాఁ నెంచియున్నట్టి నాపూన్కె నీకిష్టమే లేకయున్నన్‌ మదీయాత్మజాతన్‌ గుణోపేత నిచ్చోటకిన్‌ దెచ్చి నాకీయరాదే ముదంబంద నేనెంతయున్‌. బంధుసంఘం బుతో నీ ప్రభావంబు నిత్యంబు వర్ణింతు నమ్మా ! దయంజూడుమమ్మా ! వెతల్‌ దీర్పు మాయమ్మ ! పాతాళ లోకేశ్వరీ ! భక్తసంకల్ప సత్కల్పవల్లీ ! నమస్తే నమస్తే నమః