పుట:కాశీమజిలీకథలు-12.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    టను జనుదెంచి చేరితి నిటన్‌ జననీ ! భవదీయ దివ్యద
    ర్శనము మహాద్భుతముగద ! శాంభవీ నీ మహిమము లెన్నగన్‌.

ఉ. రక్కసుఁడొక్కఁడే డ్తెర విరాళిని దెచ్చి యరణ్యమందునన్‌
    జిక్కులఁబెట్టనున్నపుడు చేసితి నీదగు దర్శనముఁ బెం
    పెక్కఁగ స్వప్నమం దిపు డదే విథ మాపదనున్న వేళ నా
    కిక్కడ గన్నులంబడితి వీశ్వరి ! నా వెతలెల్ల దీర్చవె.

గీ. నాఁటి పోలిక యొప్ప నీనాఁడు గూడ
   స్వప్నమున నాకు నీవు సాక్షాత్కరించు
   చుంటివేమొ గ్రహింపలేకుంటినమ్మ
   హృదయపరితాపమడచి రక్షింపుమమ్మ.

తల్లీ ! త్రిభువనేశ్వరీ ! నీ ప్రభావం బిసుమంతయును గ్రహింపజాల కున్నాను. ఆపద వేళయందు నాకు బ్రత్యక్షమై మనంబు కుదుటు గరపుచున్న నీ భక్తవత్సలత్వము నెంతని కొనియాడగలను. మొదట నాకు స్వప్నమున బాతాళమున బ్రత్యక్షమైతివి. నేఁడొక కందరాంతమున నీ యునికి దెలియబడుచుండెను గదా? నేను నిక్కముగా నిపుడు నీ సన్నిధానమందుంటినో లేక యిది యంతయును భ్రాంతి మూలకమో తెలిసికొనఁజాలనైతిని. నీ నివాసము రసాతలమందుఁ గలదో యక్ష ప్రపంచమందున్నదో లేక మధ్యమలోకమందుండెనో గ్రహింపఁజాలకుంటిని. మణి గ్రీవునకు వెరచి మహాబిలమార్గము ననుసరించి యేతెంచిన నా కిచ్చట నీ యాలయము గోచరించుట భ్రాంతి మూలకముగాక వేరొకటి యెట్లగును. ఇది యంతయును స్వప్న విభ్రమమనుటకు సందియములేదు. బిలమార్గమున నడచుచుండ నాకు శ్రమ మిక్కుట మగుటచే నేనందు శయనించితిని. అప్పుడు నాకు నిద్ర వచ్చినట్లుకూడఁ గొంచెము స్ఫురించుచున్నది. ఆ నిద్రలో నేర్పడిన స్వప్న విశేషముచేతనే నిక్కముగ నేనిప్పుడు నీ యాలయమునఁ బ్రవేశించి యుంటిని. అని యాలోచించి వెండియు నిట్లనుకొనియె. అయ్యో ! ఇది స్వప్నవృత్తాంత మెట్లగును నేను మల్కొనియే యుంటిని. ఇట్లు విత ర్కించుకొనుట గూడఁ గలలో కలకాదుగదా ! అయ్యో ! నేనిప్పు డేయవస్థ యందుం టినో నిర్ధారణఁ జేసికొనలేకున్నాను, తల్లీ ! నామనం బిప్పుడతిచంచలముగా నున్నది. నిక్క మెరింగించి నన్నుఁ గృతార్దురాలిం జేయుమని యాయమ్మవారి ననేకవిధంబులఁ బ్రార్దించుచుండెను.

ఇంతలో నాదేవీమందిరమున కెవ్వరో వచ్చుచున్న సందడి యగుటయు మణిగ్రీవుఁడు దన్ను బట్టుకొనుట కందు వచ్చుచున్నాఁడేమోయను భయమున ననంగ మోహిని యతిరయంబున‌ నా దేవీ విగ్రహము చాటున కరిగి యందు దాగియుండెను.