పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. అబ్రహం లింకన్ మాటలలో ప్రజాస్వామ్యం అంటే...

“ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు”

6. మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడినది. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూలస్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది. మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికులైన వీరికి నివాళులు అర్పిస్తూ, మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం - 'స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్' ను ఏర్పాటు చేసింది. ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

మా ప్రభుత్వం ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. మా ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని నిరూపించింది. అసమానతలను రూపుమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం; నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తోంది. సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలు అని మా ప్రభుత్వం నమ్ముతుంది.

7. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంతో మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది, వాగ్ధానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతం అయ్యింది. గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకితభావం మరియు బాధ్యత, 2000 సంవత్సరాల క్రితం అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపచేస్తున్నాయి.

2