పుట:అభినయదర్పణము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్కటహస్తలక్షణము

గీ.

వెలయఁగను రెండుకరములవ్రేళ్ళు గ్రుచ్చి
యెదురుకొన సూపి ఱొమ్మున కెగయఁబట్టఁ
గర్కటహస్త మగుచును ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

14

వినియోగము

గీ.

మొనసి చూడంగ మఱియు సమూహమునకుఁ
గలుఁగుచీకటికి నిల నింక గృహమునకు
ధరను గర్కటహస్తంబు దనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

15

అవహిత్థహస్తలక్షణము

క.

మఱి పద్మకోశహస్తము
నిరువుగఁ గరయుగమునందు నెదురుగఁ బట్టం
బరువిడి నవహిత్థం బగుఁ
గరివరదా! దనుజభంగ! కస్తురిరంగా!

16

వినియోగము

క.

ఎలమిని శృంగారమునకు
నెలఁతలకుచములకు మిగులనీటుకు వగవన్
అల యవహిత్థము సెల్లును
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

17

ఉత్థానవంచితహస్తలక్షణము: వినియోగము

గీ.

పొదలఁ ద్రిపతాకహస్తంబు భుజమునందు
రెండుకరములుఁ బట్టిన మెండుగాను
నదియె యుత్థానవంచిత మగును [1]హరికి
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

18
  1. “త్రిపతాకా వంసదేశగతా వుత్థానవంచితః| విష్ణోరభినయేస్తమ్భభావనాయాం బుధోదితః| ఉత్థానవంచితాభిఖ్య స్సర్వనాట్యేషు కీర్తితః|” (అభి 558)