పుట:అభినయదర్పణము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]హంసహస్తలక్షణము

గీ.

కొమరు మీఱఁ దర్జనిక యంగుష్ఠ మమరఁ
జేర్చి మిగిలిన వ్రేళ్ళను జెన్ను మీఱఁ
జాఁప నది హంసహస్త మై చాలియుండు
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

47

హంసహస్తవినియోగము

చ.

చెలువుగఁ బూలు గోయఁగను జిత్రము వ్రాయఁగఁ బొట్టువెట్టఁగా
నిల నుపదేశముందెలుప నింపుగ హంసకుఁ [2]బుల్కరింపఁగాఁ
బలుమఱు వాసుదేవు పదపద్మము ధ్యానముచేయ నందునుం
దలకొను హంసహస్తమిది తథ్యము గస్తురిరంగనాయకా!

48

హంసపక్షహస్తలక్షణము

గీ.

చెలువు మీఱఁగ మఱి సర్పశీర్షమందు
సరగఁ జిటికెన వ్రేలిని జాఁచియున్న
హంసపక్షం బటంచని యవని వెలయు
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

49

హంసపక్షహస్తవినియోగము

చ.

చెలువుగ నేటికట్టకును జెన్నుగ వారధి గోడఁజూపనుం
బలుమఱు సేతువందు మఱి బాగుగ [3]నా ఱని లెక్కపెట్టనున్
సలలితరీతి నాకునకు శాంతిని జేయుటయందు మిక్కిలిం
జెలఁగును హంసపక్ష మిలఁజెన్నుగఁ గస్తురిరంగనాయకా!

50
  1. ఈహంసహస్తమునకే ‘హంసాస్యహస్త’మనియుఁ బేరు. “మధ్యమాద్యాస్త్రయో౽ఙ్గుళ్యః ప్రసృతా విరళాయది|| తర్జన్యఙ్గుష్ఠసంయోగే హంసాస్యకర ఈరితః” (అభి 379,380)
  2. “రచనేయాపకాదీనాం పులకే మౌక్తికేమణౌ| వేణునాదే సంయుతశ్చే ద్వాసనాయాం నిజత్మని” (అభి 387)
  3. “షట్సంజ్ఞాయాం సేతుబంధే నఖరేఖాఙ్కనే తథా| విధానే హంసపక్షో౽యం కీర్తితో భరతాగమే” (అభి 390)