పుట:అభినయదర్పణము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతురహస్తలక్షణము

ఉ.

సారెఁ గనిష్ఠకాంగుళిని జాఁచియుఁ దక్కిన మూడువ్రేళ్ళనుం
గూరిమి మీఱఁ గూర్చి యదె కొంకక మధ్యపువ్రేలిక్రిందుగాఁ
జేరినబొట్టవ్రేలి నిఁకఁ జెన్నుగ వంచియుఁబట్టి చూపఁగా
నారమణీయమౌ చతురహస్తము గస్తురిరంగనాయకా!

43

చతురహస్తవినియోగము

సీ.

అనువుగాఁ గస్తురి యనుటకుఁ జెలువొందు
              షడ్రసాలకుఁ జెమ్మకు సరవి నమరు
మఱియు సువర్ణ తామ్రాదిలోహములకు
              వరలు నానావిధవర్ణములకు
కొంచెమంచనుటకుఁ గొమరొప్పఁ గంటికిఁ
              దొలఁగి రసానకుఁ దునుకలకును
దగవుగా నింతమాత్రంబు మెల్లన యనఁ
              బరువడి ఘృతతైలపాత్రములకు


గీ.

కాంతనడలకు మఱి హంసగమనములకుఁ
జతురహస్తంబు వచ్చును సరవి మీఱ
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

44

భ్రమరహస్తలక్షణము

గీ.

పొనర నంగుష్ఠమధ్యమములను గూర్చి
గరిమఁ దర్జని వంచుక కడమవ్రేళ్ళు
చాఁచినంతనె భ్రమరహస్తంబు నగును
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

45

భ్రమరహస్తవినియోగము

గీ.

పరఁగ నిలలోనఁ జెన్నొందు భ్రమరమునకు
నరయఁ గోకిలకును జెల్లు నమరవంద్య!
భ్రమరహస్తంబు మిక్కిలి భావ మలర
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

46