పుట:అభినయదర్పణము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

బరఁగఁ బదములు ప్రియమునఁ బట్టుటకును
వెలయఁ [1]బరిచీలు వట్టను వేడ్కఁగాను
నెనసి మృగశీర్ష హస్త మై తనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

సింహముఖహస్తలక్షణము

గీ.

మఱి యనామిక యంగుష్ఠమధ్యమములుఁ
గూర్చి మిగిలిన వ్రేళ్ళను గువలయేశ!
చాఁచినను సింహముఖ మయి జగతి వెలయు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

సింహముఖహస్తవినియోగము

గీ.

ఆజ్యహోమంబునకుఁ బిల్లియస్థులకును
జింక కుందేలు వ్యాఘ్రంబు సింహములకు
నెలమి మఱి సింహముఖ మయి వెలయుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

లాంగూలహస్తలక్షణము

క.

మఱి పద్మకోశమందున
వరుస ననామికపువ్రేలు వంచిన మఱియున్
నిరతము లాంగూలంబన
గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా!

లాంగూలహస్తవినియోగము

సీ.

చేమంతిపూలకుఁ జెలఁగిన యలనిమ్మ
              పండ్లకు మఱి చిన్న చెండ్ల కమరు
చిన్నిఘంటలకును గన్నేరుపూలకుఁ
              బొనరఁ బోకలకును బుంటలకును

  1. ఈఁటె “పరశుపట్టిసముల బాకుల వాడి, బరిచీల నురుగదాప్రముఖాయుధముల” (సారం 2 భా)