పుట:అభినయదర్పణము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరాళహస్తలక్షణము

గీ.

అనువుగాఁ జూడను పతాకహస్తమునను
దర్జనిక వంచిపట్టిన ధర నరాళ
హస్తమయి చాలవేడ్కగా నతిశయిల్లు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

16

అరాళహస్తవినియోగము

క.

ఇరవుగ నాచమనీయము
బరువడి సుడిగాలి నమృతపానంబుననున్
మఱి విషపానము సేయను
గరిమ నరాళంబు వచ్చుఁ గస్తురిరంగా!

17

శుకతుండహస్తలక్షణము

గీ.

అరసి చూచిన మురహరీ! మఱి యరాళ
నామకరమందు వంప ననామికంబు
నదియె శుకతుండహస్త మై యవని వెలయు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

18

శుకతుండహస్తవినియోగము

గీ.

పరఁగు కుంతాయుధమునకు బాణమునకు
మఱియు మర్మము భేదించుమార్గమునకు
మెచ్చ శుకతుండహస్తమె వచ్చుఁగాదె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

19

ముష్టిహస్తలక్షణము

గీ.

పరఁగ వ్రేళ్ళన్ని మఱి గూర్చిపట్టియున్న
ముష్టిహస్తంబదే యండ్రు మోహనాంగ!
భానుసంకాశ!నుతజనభయవినాశ!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

20