పుట:అభినయదర్పణము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మయూరహస్తలక్షణము

గీ.

మెఱయ నంగుష్ఠమున ననామికను గూర్చి
కడమ వ్రేళ్ళనుఁ జాచిన ఘన మయూర
హస్తమను పేర విస్తరిల్లు నవని లోన
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

12

మయూరహస్తవినియోగము

చ.

నెమలిని దీఁగె లల్లుటను నిక్కముగా శకునంబుఁజూడనున్
రమణులు కాటుకుంచుటను రమ్యముగా మఱి బొట్టుపెట్టుటం
గ్రమముగ వాంతిచేయుటను గ్రమ్మఱఁ జూడఁగ నిన్ని తావులం
దమర మయూరమై వెలయు నన్నిటఁ గస్తురి రంగనాయకా!

13

అర్థచంద్రహస్తలక్షణము

క.

ఇరువుగ సపతాకంబును
సరసను నంగుష్ఠ మెనయఁ జూఁచిన నదియున్
మఱి యర్థచంద్రహస్తము
గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా!

14

అర్థచంద్రహస్తవినియోగము

సీ.

సారెకుఁ గృష్ణపక్షాష్టమిశశిఁ జూపఁ
              జెక్కిటఁ జెయ్యుంచి చింతపడను
నడుము పట్టుటకును మెడఁబట్టి నూకను
              ధ్యానంబు సేయను దాన యనను
భల్లాయుధమునను బ్రార్థించుటను మఱి
              చెలువొంద రామ రాఁ జేయుటకును
భుజము దట్టుక జెట్లు పోట్లాడఁ జూడను
              సొంపుగా నమరులఁ జూపుటకును


గీ.

జేరి యభిషేకమును వేడ్కఁజేయుటకును
నరయఁగా నిన్నితావుల నర్థచంద్ర
హస్తమది వచ్చునిదె చూడు మంబుజాక్ష!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

15