తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 265

వికీసోర్స్ నుండి

రేకు. 0265-01 లలిత సం: 03-372 అధ్యాత్మ


పల్లవి :

ధరఁ గడపట నేజంతువుకైనా తన జన్మమే సుఖమై తోఁచు
హరి గలఁడని తా నమ్మివుండఁగా నతఁడిచ్చే సుఖ మొల్లరు


చ. 1:

మొదలఁ గొందరికి స్వర్గలోకమే మోక్షసుఖంబని తోఁచును
అదె కొందరికి దేవత్వమే బ్రహ్మానందంబై తోఁచును
వుదుటునఁ గొందరికి సంసారమే వున్నతసుఖమై తోఁచును
తుద నా మీఁదటి హరిదాస్యసుఖము ధ్రువపట్టంబని కానరు


చ. 2:

సొరిదిఁ గొందరటు శూన్యతత్త్వమేసుఖమనిమాఁటలనందురు
యిరవెరఁగనివారికి ధనధాన్యము లెక్కువ సుఖమై తోఁచును
నిరతిఁ గొందరికి చిరజీవులౌటే నిత్యసుఖంబని తోఁచును
వరుసల శ్రీపతిపై భారంబిదె వైరాగ్యపుసుఖ మెఱఁగరు


చ. 3:

యెక్కడ చూచిన మాయలసుఖములు యెన్నెనాఁ గలవెప్పుడును
చొక్కపు శ్రీవేంకటపతి తోడుట సుఖియించేటి సుఖ మొల్లరు
యిక్కడ నక్కడ నీతని దాసులే యేచి సుఖింతురు నిజసుఖము
కిక్కిరిసిన యజ్ఞానాంధకారులు కిందును మీఁదును నెరఁగరు

రేకు:0265-02 మలహరి సం: 03-373 శరణాగతి


పల్లవి :

నీకెటు వలసె నటుసేయి నీచిత్తము నా భాగ్యము
యేకడనైనా లక్ష్మీకాంతుఁడ ఇదియే పో నా విన్నపము


చ. 1:

నాగుణములే యెంచితినా నరక కూపములు చాలవు.
ఆగతినే నాకర్మములూ అనుభవించి తీర్చెనంటే
నీ గుణములే యెంచితివా నిఖిలసంపదలు చాలవు
యీగి ననుఁ గరుణించి యెపుడు నీవిచ్చేనంటేను


చ. 2:

నాపాపములే లెక్కించితినా నదులయిసుకలునుఁ జాలవు
యేపున నెంతైనాఁ గలదు అది యెన్నఁడు దీరును దేవా
చేపట్టి నీవు రక్షించిన యాజీవుల నెంచితివా తొల్లి
చూపట్టెడి యీయాకసంబు పై చుక్కలకంటే ఘనము


చ. 3:

మఱి నాసుద్దులు యెంచఁగ నెంచఁగ మంచముకిందే నూయి
గుఱి నీకథలివి వినఁబోతే నివే కొండలుఁ గోటానఁగోట్లు
నెఱవుగ శ్రీవేంకటేశ్వర నీకే నే శరణాగతి చొచ్చితిని
తఱి దరిచేర్పఁగఁ గూడువెట్టఁగా దైవము నీకే భారము

రేకు: 0265-03 లలిత సం: 03-374 అంత్యప్రాస


పల్లవి :

అరసి నన్నుఁ గాచినాతనికి శరణు
పరము నిహమునేలే పతికిని శరణు


చ. 1:

వేదములు దెచ్చినట్టి విభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసాఁ దానై యున్నయీతనికి శరణు
శ్రీదేవిమగఁడైన శ్రీపతికి శరణు


చ. 2:

అందరికిఁ బ్రాణమైన అతనికి శరణు
ముందు మూఁడుమూర్తులమూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవునికి శరణు
అంది మిన్నునేల నేకమైనతనికి శరణు


చ. 3:

తానేఁ చేతన్యమైన దైవానకు శరణు
నానాబ్రహ్మాండాలనాథునికి శరణు
ఆనుక శ్రీవేంకటాద్రియందునుండి వరములు
దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు

రేకు: 0265-04 మంగళ కౌశిక సం: 03-375 శరణాగతి


పల్లవి :

ఇది నమ్మలేఁడు పుణ్యాలేమేమో చేసీ దేహి
పొదలి యిందువంకనే పొడవెక్కలేఁడా


చ. 1:

మంచి మందుగొన్నవాఁడు మహామహారోగముల
అంచెలఁ బాసి సుఖియయ్యీనటా
అంచితపు హరినామమనే మందుగొన్నవాఁడు
పొంచి పాపరోగములఁ బోఁదోలలేఁడా


చ. 2:

జోడు దొడిగినవాఁడు చొక్కపు టలుగులకు
వోడక రణజయము నొందీనటా
వాడక హరిదాస్యపు వజ్రపంజరపువాఁడు
వీడ జన్మపుటమ్ములు విదలించలేఁడా


చ. 3:

వైపగుఁ గాణాచిగలవాఁడు దరిద్రముఁ బాసి
పైపై సంపదలతో బ్రదికీనటా
దాపై శ్రీవేంకటేశు పాదములందుఁ గాణాచి
యేపొద్దుఁ గలుగువాఁడు యెక్కువగా లేఁడా

రేకు: 0265-05 గుండక్రియ సం: 03-376 వైరాగ్య చింత


పల్లవి :

ఎక్కడి వుద్యోగాలు నేడకెక్కు జీవునికి
నిక్కిచూచి హరి గరుణించిన దాఁకాను


చ. 1:

తనిసినవారు లేరు తగ నింద్రియభోగాలు
పెనఁగఁ బెనఁగఁ బైపై బెరుగుఁ గాని
మనసులోనికి రాదు మాటలలోని విరతి
తునిగినట్లనుండు దొరకుదాఁకాను


చ. 2:

విడిచినవారు లేరు విషయాలు సంపదలు
పుడుగక కోరఁగోర నొదగుఁగాని
పుడిమి విన్నట్టుండదు పుస్తకాలలో చదువు
నడుమంత్రములనుండు నానినదాఁకాను


చ. 3:

తెలిసినవారు లేరు దేవుని నాతుమలోన
పలు లంపటాలఁ బడి భ్రమనుఁ గాని
యెలమి శ్రీవేంకటేశుఁ డేమిటా మెచ్చఁడు తన్నుఁ
దలఁచి భక్తితోడ దగ్గరుదాఁకాను