తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 264

వికీసోర్స్ నుండి

రేకు: 0264-01 శుద్ధవసంతం సం: 03-367 ఉపమానములు


పల్లవి :

కడనుండే విజ్ఞానికిఁ గా దిటువలెను
వొడలి రోఁతలు చూచి వూరకైనా నవ్వును


చ. 1:

ఆఱడిఁ బాము గరచినట్టివాఁడు దినఁబోతే
జాఱని వేఁప చేఁదైనాఁ జప్పనై తోఁచు
వీఱిడై సంసారపువిష మెక్కినవానికి
చూఱలై హేయకాంతలు సుఖములై తోఁచును


చ. 2:

చెంగట వెఱ్ఱివానికి చేసిన చేఁతలెల్ల
తొంగలించి వివేకాలై తోఁచినట్లు
మింగుచుఁ గర్మపు నాము మేసిన సంసారికి
అంగడి కర్మమే బ్రహ్మమై తోఁచును


చ. 3:

జగమిది యొక్కటే చవులు వేరేవేరే
మొగి నెఱుకమఱపు ముడిచున్నది.
పగటు శ్రీవేంకటేశుఁ బట్టి కొలువనివాఁడు
తెగని మాయలలోనఁ దేలాడవలసె

రేకు: 0264-02 బౌళి సం: 03-368 శరణాగతి


పల్లవి :

నరహరి నీ దయమీఁదట నా చేఁతలు గొన్నా
శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా


చ. 1:

మొఱయుచు నరకపు వాకిలి మూసిరిహరినీదాసులు
తెఱచిరి వైకుంఠపురము తెరువుల వాకిళ్ళు
నుఱిపిరి పాపములన్నియు నుగ్గుగ నిటు తూర్పెత్తిరి
వెఱవము వెఱవము కర్మపువిధులిఁక మాకేలా


చ. 2:

పాపిరి నా యజ్ఞానము పరమాత్ముఁడ నీదాసులు
చూపిరి నిను నామతిలో సులభముగా నాకు
రేఁపిరి నీపై భక్తిని రేయినిఁ బగలును నాలో
వోపము వోపము తపములు వూరకే ఇఁక నేలా


చ. 3:

దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీవేంకటేశ్వర
అద్దిరి నీదాసులు నీయానందములోన
ఇద్దరి నీనా పొందులు యేర్పరచిటువలెఁ గూర్చిరి
వొద్దిక నొద్దిక నాకిఁక నుద్యోగములేలా

రేకు: 0264-03 ముఖారి సం: 03-369 అంత్యప్రాస


పల్లవి :

ఎంత విచారించుకొన్నా నిదియే తత్త్వము హరి
వంతుకు నీకృపగలవాఁడే యెరుఁగు హరి


చ. 1:

నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి
నిన్ను నొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి
మున్ను దేవతలు నీకు మ్రొక్కి బ్రదికిరి హరి
వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి


చ. 2:

యేపున నీ పేరిటీవాఁ డిన్నిటా ధన్యుఁడు హరి
నీ పేరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడు హరి
కేపుల నిన్ను నుతించి గెలిచె నారదుఁడు హరి
పైపై నిన్నుఁదిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి


చ. 3:

యిట్టే నీవిచ్చిన వరమెన్నఁడుఁ జెడదు హరి
గట్టిగ నీవియ్యనివి కపటములే హరి
అట్టె శ్రీవేంకటేశుఁడ వంతరంగుఁడవు హరి
వుట్టివడి కానకున్న వొచ్చెము దేహికి హరి

రేకు: 0264-04 సామంతం సం: 03-370 దశావతారములు


పల్లవి :

ఇతనికంటే మరి దైవముఁ గానము యెక్కడ వెదకిన నితఁడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటి కాధారము దానె


చ. 1:

మది జలధుల నొక దైవము వెదకిన మత్స్యావతారం బితఁడు
అదివో పాతాళమందు వెదకితే నాదికూర్మ మీవిష్ణుఁడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి
చెదఱక కొండల గుహల వెదకితే శ్రీనరసింహం బున్నాఁడు


చ. 2:

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
బలువీరులలో వెదకి చూచితే పరశురాముఁ డొకఁడై నాఁడు
తలఁపున శివుఁడునుఁ బార్వతి వెదకిన తారకబ్రహ్మము రాఘవుఁడు
కెలఁకుల నావులమందల వెదకిన కృష్ణుఁడు రాముఁడునైనారు.


చ. 3:

పొంచి యసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాఁడు
మించిన కాలము కడపట వెదకిన మీఁదటి కల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన నంతర్యామై మెరసెను
యెంచుక ఇహమునఁ బరమున వెదకిన యీతఁడే శ్రీవేంకటవిభుఁడు

రేకు: 0264-05 లలిత సం: 03-371 విష్ణు కీర్తనం


పల్లవి :

చాలుఁజాలు నీ హరియేమాకును సకలక్రియలకు నాయకుఁడు
నాలుక తుదనే యీతఁడుండఁగా నలుగడ నెవ్వరి వెదకేము


చ. 1:

యేలినవాఁడట లక్ష్మీవిభుఁడట యేమిటనుఁ గొరత మాకిఁకను
నాలోనున్నాఁడు బ్రహ్మతండ్రియట నాకాయుష్యము బాఁతా
పాలజలధిపై దేవుని వారము పాఁడి మాకు నిఁక నేమరుదు
ఆలింపఁగ నేమింతటివారము అన్యులకిఁకఁ జేయి చాఁచేమా


చ. 1:

భూకాంతాపతికింకరులము యీభూములిన్నియునుమా సొమ్మే
పైకొని చక్రాయుధుఁడే మాదాపు భయము లిన్నిటాఁ బాసితిమి
యీకడ నచ్యుతుమరఁగు చొచ్చితిమి యెన్నటికిని నాశములేదు
యేకొఱఁతని ఇఁక నాసపడుచు నేమెవ్వరికి నోళ్లు దెరచెదము


చ. 1:

శ్రీవైకుంఠుని దాసులమట యరచేతిది మోక్షము మా కిదివో
పాపనగంగాజనకుని బంట్లము పాపములన్నిటఁ బాసితిమి
శ్రీవేంకటపతి వరములియ్యఁగా జిక్కిన వెలుతులు మాకేవి
యీ వైభవములఁ దనిసిన మాకును ఇతరులఁ దగిలెడిదిఁక నేది