తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 266

వికీసోర్స్ నుండి

రేకు: 0266-01 పాడి సం: 03-377 శరణాగతి


పల్లవి :

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి
ప్రకటమై మాకు నబ్బె బదికించు నిదియె


చ. 1:

మనసులో పాపబుద్ధి మరి యెంతదలఁచినా
నినుఁ దలఁచినంతనే నీరౌను
కనుఁగొన్నపాపములు కడలేనివైనాను
ఘనుఁడ నిన్నుఁజూచితే కడకుఁ దొలఁగును


చ. 2:

చేతనంటి పాతకాలు సేవగా నేఁ జేసినాను
ఆతల నీకుమొక్కితే నన్నియుఁ బాయు
ఘాతలఁ జెవుల వినఁగా నంటిన పాపము
నీతితో నీ కథ వింటే నిమిషానఁ బాయును


చ. 3:

కాయమునఁ జేసేటి కర్మపుఁ బాపములెల్ల
కాయపు నీ ముద్రలచే గక్కన వీడు
యేయెడ శ్రీవేంకటేశ యేయేపాతకమైనా
ఆయమైన నీశరణాగతిచే నణఁగు

రేకు: 0266-02 లలిత సం: 03-378 వైరాగ్య చింత


పల్లవి :

రెప్పల మరఁగదె రేపును మాపును
యిప్పుడే తోఁచీనిదివో కీలు


చ. 1:

మనసున నున్నవి మాయలన్నియును
మనసు మరచితే మాయలు మరచును
పనివడి మనసునుఁ బారఁగవిడిచిన
కనుఁగొన మాయలు కడలే వివిగో


చ. 2:

దేహమున నున్నది తెగని లంపటము
దేహ మణఁచితేఁ దెగును లంపటము
వూహల దేహమే వోమగఁ దొడఁగిన
మోహపు మాయలు మోపుల కొలఁది


చ.3:

ఆతుమ నున్నాఁడు అంతరాత్మకుఁడు
ఆతుమ మరచిన నాతఁడు మరచును
యీతఁడె శ్రీవేంకటేశ్వరుఁ గొలిచిన
చేచేతనే సుఖములు సేనాసేన

రేకు: 0266-03 మాళవి సం: 03-379 వైరాగ్య చింత


పల్లవి :

అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే
మున్నె నా భావముతో ముడిచివేసినది


చ. 1:

చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి
ములిగి ముక్తిదలఁచి ముక్తుఁడనైతి
పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి
చెలఁగి శ్రీపతిఁ దలఁచి వైష్ణవుఁడనైతి


చ. 2:

పొసఁగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి
పసలఁ బాపముచేసి పాపకర్ముఁడనైతి
వెస బ్రహ్మచారినైతి వేరె యాచారమున
ముసిపి మరొకాచారమున సన్యాసినైతి


చ. 3:

వొగి నొడ్డెభాషలాఁడి వొడ్డెవాఁడనైతిని
తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగువాడనైతి
అగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను
తగు నీదాఁసుడనై దాసరి నేనైతి

రేకు:0266-04 సాళంగనాట సం 03-380 కృష్ణ


పల్లవి :

ఇహపరములు గొన నీ దేవుఁడే
సహజ మిన్నిటాను సర్వేశుఁడే


చ. 1:

తలఁచి చూచినాను తనలోనే మఱచిన (నా?)
తలఁపుల కొనవాఁడు దైవ మొకఁడే
పలికి చూచినాను పలుకక మానినాను
పలుకుల కొనవాఁడు పరమాత్ముఁడే


చ. 2:

కనుఁగొని చూచినాను కనురెప్ప మూసినాను
కనుచూపు కొనవాఁడు కమలాక్షుఁడే
విని యాలకించినాను వినకట్టె మానినాను
వినుకుల కొననెల్లా విష్ణుఁడొక్కఁడే


చ. 3:

మేలుకొని వుండినాను మించి నిద్దిరించినాను
కాలము కొనలవాఁడు ఘనుఁడీ హరే
యీలాగు శ్రీవేంకటేశుఁ డెదలోన నున్నవాఁడ
కీలు విచారించితే కృష్ణుఁ డితఁడే

రేకు: 0266-05 ధన్నాసి సం: 03-381 శరణాగతి


పల్లవి :

నేనేమి బాఁతి నీకు నీరుణము పాపలేను
నానావిధముల నీవే నన్నుఁ బాయవుగా


చ. 1:

మతిలో చీఁకటి మాన్ప మాణిక్యదీపమవై
సతమై నాలికె పైకి చవి దేనెయై
కతలై నన్నుఁ జొక్కించఁ గర్ణామృతమవయి
గతియైతివిగా నాకుఁ గమలారమణా


చ. 2:

చేరి నా కన్నులెదుట శృంగారరసమవై
ఆరసి రక్షించఁ బితురార్జితమవై
సారపు టిహపరాలు సంసారసుఖమవై
యీరీతిఁ బెంచితిగా నా కిందిరారమణా


చ. 3:

తనువిచ్చి జీవునికిఁ దల్లి వి తండ్రివినై
ధనమపై దాతవు దైవమవునై
అనుఁగు శ్రీవేంకటేశ అంతరాత్మవు నీవై
నను మన్నించితివిగా నారాయణా


రేకు: 0266-06 శంకరాభరణం సం: 03-382 అధ్యాత్మ


పల్లవి :

ముగియదు కాలము ముందరికి కింకాఁ
దెగని ప్రవాహము దినదిన మిదిగో


చ. 1:

పొంకపు హరిచేఁ బొడమిన జగమిది
యింకాఁ బొడమీనివి గొన్ని
కంకిగఁ జెరువులు కాల్వలు నంటా
అంకెల నిర్మితమయ్యీ నివిగో


చ. 2:

దేహము భోగించి దించిన విషయము-
లీహల మీఁదెత్తె నివి గొన్ని
ఆహారములై అన్యస్త్రీలై
వూహలనే నోరూరించీ నివిగో


చ. 3:

మనసునఁ దలఁచిన మాయలు కమ్మర -
నినుమడించె మతి నివి గొన్ని
కనుఁగొని శ్రీవేంకటపతిదాసులు
పెనఁగి పెంచఁగాఁ బెరిగీనిదిగో