తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 242

వికీసోర్స్ నుండి


రేకు: 0242-01 సాళంగనాట సం: 03-2౩9 నృసింహ

పల్లవి:

శరణని బ్రదుకరో జనులాల
గరిమ మెరసె నిదె కనకసింహము

చ. 1:

అహరహమునుఁ బ్రహ్లాదుఁడు దొరకొని
బహువిధముల హరిమహిమలు వొగడఁగ
కహకహ హిరణ్యకసిపుఁడు నగి హరి
సహజ మేదియని చఱచెఁ గంభము

చ. 2:

అటమరి పెటపెటమని బేంట్లెగసి
చిటచిటరవములఁ జిరుతపొగ లెగసి
తటతట మనుచును తరలి వ్రయ్యలై
పటపటమనుచును పగిలెఁ గంభము

చ. 3:

బెడిదపు చూపుల మిడుఁగురు లెగయఁగ
పుడమి యదర నూర్పులు చెలఁగ
గడగడ వడఁకి దిక్తటము లల్లాడఁగ
వెడలెఁ గంభమున విజయసింహము

చ. 4:

నగవుల సుడివడె నభోంతరంబులు
పొగ లెగసెను పెనుబొమముళ్ళ
పగటు నార్పులను పగిలెనుఁ గొండలు
వెగటుగ వెడలెను వీరసింహము

చ. 5:

తెఱచిన నోరఁ బ్రతిధ్వను లెసగఁగ
కఱకుగతుల చుక్కలు చెదర
నెఱి హుంకృతులను నిఖిలము బెదరఁగ
వెఱచఱవఁ గెరలె విమలసింహము

చ. 6:

పటువిహారముల బ్రహ్మాండ మగల
గుటగుటరవళి నాకులు వొగడ
నిటలనేత్రమున నెఱమంట లడర
పటుగతి మెరసెను భయదసింహము

చ. 7:

పెదపెదకోఱల పిడుగులు రాలఁగ
తుదనఖముల నెత్తురు దొరుగ
గుదిగొను కసరుల కులగిరు లూఁటాడ
వుదయించె నదివో వుగ్రసింహము

చ. 8:

అట్టహాసమున నసురలు వారఁగ
ముట్టి వాయువులు మొగతిరుగ
దట్టములై జలధరములు ముసరఁగ
దిట్టయై వెడలె ధీరసింహము



చ. 9:

జలధులు గలఁగెను జడిసె లోకములు
తలఁకె సప్తపాతాళములు
వులికిపడఁ దొడఁగె నూర్ధ్వలోకములు
కొలువున నిలిచెను ఘోరసింహము

చ. 10:

అచ్చట హిరణ్యు నదరంటఁబట్టి
యిచ్చలఁ దొడపై నిడి చించి
కుచ్చి వాని పేగులు జంద్యములుగ
విచ్చి వేసుకొనె విష్ణుసింహము

చ. 11:

పొగడిరి దివిజులు భువనములు వెలసె
పగయుడిగి చెలఁగెఁ బ్రహ్లాదుఁడు
మిగులశాంతమున మించె శ్రీవేంకట-
నగమున నహోబలనారసింహము


రేకు: 0242-02 బౌళి సం: 03-240 వేంకటగానం

పల్లవి:

దేవా నీవే యిన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి
యేవలనైనా నీవేకాక భువి నింతటివారలు యిఁకఁ గలరా

చ. 1:

జనులకు నీవే వొక్కొకచోటను శాస్త్రార్థములై కడఁగుదువు
తనియక నీవే మరి వారికి బొధకులఁ గొందరినిఁ గల్పింతువు
మనసులో నంతలో వొడఁబడికె చేసి మలయుచు నీవే నిలుతువు
కనుఁగొన నీవే సుజ్ఞానమార్గము కైవసముగాఁ దెలుపుదువు

చ. 2:

కడఁగి యప్పటి నివే యజ్ఞాదికర్మఫలములై వుండుదువు
తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు
యెడయక నీవే తపోమహిమలై యెదుటనే తార్కాణ లౌదువు
వొడలై నీవే యిహపరములకును వొడిగట్టి సాధింపింతువు

చ. 3:

ఆవేళ నీవే తత్త్వనిర్ణయము నాధారమునై యేర్పరతువు
నీవే కమ్మటి ఆచారవిధులకు నియమములెల్లా నేర్పుదువు
భావింప నీవే అలమేల్మంగకుఁ బతివై శ్రీవేంకటేశ రక్షింతువు
జీవుల కంతర్యామివై నీవే శిష్టులఁ బరిపాలింతువు


రేకు: 0242-03 ధన్నాసి సం: 03-241 వైష్ణవ భక్తి

పల్లవి:

విచారించుకోరో యిది వి???కులాల మెండు-
పచారాలు చూచి మీరు భ్రమయకురో

చ. 1:

భావింప నారదునికి బ్రహ్మపట్ట మరుదా
వేవేలైనాఁ గొంచెమని విడిచెఁగాక
దేవతలు తన్నుఁ జూచి దిగ్గన లేచి మొక్కేటి-
ఆవైభవపు పదమందెఁ గాక

చ. 2:

మిక్కిలి జ్ఞానము గల్గి మించి తమ నేరుపెల్లా
చిక్కి సంసారము పాలు సేయవలెనా
యెక్కువ హరిదాసుఁడై యిట్లానే వైకుంఠ-
మెక్కెడితోవ సాధించేదిది మేలుఁ గాక

చ. 3:

మూలమని నుడిగితే ముంచి యెవ్వఁడు గాచెను
పోలించ నెవ్వని నాభిఁ బుట్టె లోకాలు
చాలి యెవ్వనికుక్షి నీజగము లున్నవి మరి
కాలమందే ఆదేవునిఁ గానవలెఁ గాక

చ. 4:

యిదియే శ్రీవైష్ణవులు యిలఁ బూర్వాచార్యులు
వెదకి చదివి కన్నవివరమెల్లా
తుదమొద లెరఁగని దుష్టులకతలు మాని
పదిలమై యిట్టే నమ్మి బ్రదుకుటఁ గాక

చ. 5:

సంకుఁజక్రములు మాని సమానభోగముతోడ
అంకెల శ్రీవేంకటేశునండ నుండరో
పొంకపుబుద్ధు లిమ్మని పొంచి గాయత్రి జపించి
ఇంక బ్రహ్మవేత్త లెంచేదిందుకే కాక