తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 241

వికీసోర్స్ నుండి


రేకు: 0241-01 రామక్రియ సం: 03-233 రామ

పల్లవి:

రాముఁడు లోకాభిరాముఁడు
ఆముక విజనగరమందు నున్నవాఁడు

చ. 1:

చక్కఁదనములవాఁడు జానకీవల్లభుఁడు
గక్కన శబరిపూజ గైకొన్నవాఁడు
వెక్కసమైన పైడివిల్లునమ్ములవాఁడు
రక్కసులవైరి దశరథనందనుండు

చ. 2:

శరధి గట్టినవాఁడు చాయ నల్లనివాఁడు
యిరవై సుగ్రీవాదుల నేలినవాఁడు
సరి భరతశత్రుఘ్నసౌమిత్రి సేవితుఁడు
అరిది మునుల కభయమిచ్చినవాఁడు

చ. 3:

అట్టె కౌసల్యాత్మజుఁడు అయోధ్యాపతైనవాఁడు
వొట్టి తారకబ్రహ్మమై వుండేటివాఁడు
గుట్టుతో వరములిచ్చేకోనేటిదండవాఁడు
పట్టపు శ్రీవేంకటాద్రిఁ బరగినవాఁడు


రేకు: 0241-02 సాళంగనాట సం: 03-234 నృసింహ

పల్లవి:

కంటిరా వో జనులాల కరుణానిధి యితఁడు
జంట లక్ష్మీదేవితోడ సరుస నున్నాఁడు

చ. 1:

వాఁడివో ప్రతాపసుగ్రీవ నరసింహు డట్టె
మూఁడుమూర్తు లొకరూపై ముంచివున్నాఁడు
వేఁడి రక్కసులనెల్ల విదళించి వేసినాఁడు
పోఁడిమి సురలఁ గాచీ భువనాధీశుఁడు

చ. 2:

ఇరవైన రవిచంద్రు లితని కన్ను లివిగో
ధరణి ననంతవేదము లూర్పులు
అరుదై చెలఁగె బ్రహ్మాండ మీతని నెలవు
నిరతి సనకాదులు నిత్యసేవకులు

చ. 3:

ఘన మైన శంఖుచక్రములతో మెరసీని
మనిపె ప్రహ్లాదుని మన్నించె నిదె
యెనలేని శ్రీవేంకటేశుఁడై వున్నవాఁడు
అనిశము సకలాంతరాత్మ తానైనాఁడు


రేకు: 0241-03 ముఖారి సం: 03-235 కృష్ణ

పల్లవి:

ఉవిదలాల చూడరే వుద్దగిరి కృష్ణుఁడు
నవకపు సెలవుల నవ్వుచున్నాఁడు

చ. 1:

అచ్చపు బాలుఁడై శకటాసురు మర్దించినాఁడు
కుచ్చి కాఁగిళ్ల నింతులఁ గూడినాఁడు
మచ్చిక దోఁగెడు తాను మద్దులు విరిచినాఁడు
పిచ్చిలఁ బూతకి చన్ను పీరిచినాఁడు

చ. 2:

పిన్ననాఁడే కోడెలతోఁ బెనఁగి గెలిచినాఁడు
యెన్నికగా వేలఁ గొండ యెత్తినాఁడు
నెన్నడిని కొండపాము వెస రెండు సేసినాఁడు
పన్ని కంసుని మదము భంజించినాఁడు

చ. 3:

పొంచి పెద్దవాఁడై భూభారము దించినాఁడు
అంచెఁ బాండవులకు దిక్కైనవాఁడు
మించి శ్రీవేంకటగిరిమీఁద నిదె వున్నవాఁడు
వంచించక దాసులకు వరాలిచ్చేవాఁడు


రేకు: 0241-04 ఆహిరినాట సం: 03-236 నృసింహ

పల్లవి:

అరుదరుదీగతి యహోబలేశ్వర
పొరిఁబొరి దాసులు పొగడుట యెట్టు

చ. 1:

యెదుటఁ జించితివి హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుఁడు బంటగుటెట్లు
కదిసిన రుద్రుని గర్వ మడఁచితివి
గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు

చ. 2:

ఘనసింహాకృతి గైకొనివుంటివి
యెనయఁగఁ గరిఁ గాచిన దెట్లు
పనివడి కంబము వగుల వెడలితివి
మనుజులు పూజించి మరుగుట యెట్లు

చ. 3:

సరవితో వీరరసమున మించితివి
అరయఁగ శృంగారివౌటెట్టు
సిరిపుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీ తొడ యెక్కుట యెట్టు


రేకు: 0241-05 దేసాళం సం: 03-237 అంత్యప్రాస

పల్లవి:

నిండు కంతటా నున్నది నీమాయ
వొండొకరు జనులకు నుపదేశించనేలా

చ. 1:

నేరకుంటే సంసారము నేరుపును నీమాయ
చేరకుంటే గడులోను చేసుకొను నీమాయ
వూరకొడఁబడకుంటే వొడఁబరచు నీమాయ
పోరి బిడ్డలకు తండ్రి బుద్ది చెప్పవలెనా

చ. 2:

నాలికె కారురుచులు నలిఁ దెలుపు నీమాయ
బేలుఁడై విరక్తుఁడై భిక్ష మెత్తించు నీమాయ
పాలుమాలేమంకునైనా పనిసేయించు నీమాయ
రేలుఁబగళ్లొకరు ప్రేరేఁపుచుండవలెనా

చ. 3:

చొక్కించి నోరుఁ జేతికి సూటి చూపు నీమాయ
పెక్కులాగుల నన్నిటాఁ బెనగించు నీమాయ
వెక్కసపలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ
తక్కక నీమహిమిది తలపించవలెనా


రేకు: 0241-06 లలిత సం: 03-238 అంత్యప్రాస

పల్లవి:

మనుజు లూరకే తాము మరఁగులంటా నుందురు
యెనసి దేవుఁడు సేసే నిందరికి మాయ

చ. 1:

వినికందరి కొక్కటే వివరములే వేరు
కనుచూపులు నొక్కటే కాంక్షలే వేరు
మనసూ నొక్కటే లోనిమర్మములే వేరు
తనివియు నొక్కటే తనువులే వేరు

చ. 2:

లోకమును నొక్కటే లోనువెలుపల వేరు
వాకు లొక్కటే భాషలవరుసే వేరు
జోక నాహార మొక్కటే సొరిది రుచులే వేరు
కైకొన్నరతి యొక్కటే కందువలే వేరు

చ. 3:

పరిమళ మొక్కటే భాగించుకొనుటే వేరు
యిరవైన దొక్కటే యింపులే వేరు
అరిది శ్రీవేంకటేశ అన్నిటా నీదాఁసుడు(ల?)
శరణాగతి యొక్కటే జాతులే వేరు