తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 240

వికీసోర్స్ నుండి


రేకు: 0240-01 సామంతం సం: 03-227 శరణాగతి

పల్లవి:

ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను
యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి

చ. 1:

పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
అట్టె వారి చరితలు ననేకములు
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక
బట్టబయలే నానాభావాలఁ బొందుదురు

చ. 2:

సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు
అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
దరినుండే వగరించి తమకింపుచుందురు

చ. 3:

వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
గడియించే పదార్థాలు కలవెన్నైనా
యెడయక శ్రీవేంకటేశ నీదయ గలి(గి?)తే
జడియక నీదాసులు సంతసమందుదురు


రేకు: 0240-02 దేసాక్షి సం: 03-228 శరణాగతి

పల్లవి:

నారాయణ నీదాసుల నడకలివి
ధారుణి నిదేపనై తగులఁగవలెను

చ. 1:

ఆతుమలో హరిమీఁది ఆందోళమే వలె
చేతికి లోఁగాకుంటేను చింతించవలె
ఆతనిఁ జూచేయందుకు నాసలఁ బొరలవలె
రీతినివెప్పుడు విచారించుకొనవలెను

చ. 2:

నీలవర్ణు కథలకు నివ్వెరగు నొందవలె
ఆలకించి యందు భ్రమయఁగవలెను
తాలిమితో మహిమలు దలపోసుకొనవలె
వేళవేళ ధ్యానించి వెదకఁగవలెను

చ. 3:

చేరి శ్రీవేంకటేశు సేవించుకుండఁగవలె
గారవాన సదా మరుగఁగవలెను
ఆరసి పెద్దలనన్నీ నడుగుచుండఁగవలె
నోరునిండా నేపొద్దూ నుతియించవలెను


రేకు: 0240-03 ముఖారి సం: 03-229 శరణాగతి

పల్లవి:

జగములేలేవాఁడవు జనార్దనుఁడవు
తగ నీవారమై(మే?) నేము ధర నెట్టుండినాను

చ. 1:

గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసిన తప్పులు లోఁగొనవే

చ. 2:

తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు
యెల్ల వారికిఁ బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము
చల్లఁగా మా నేరములు సైరించుకొనవే

చ. 3:

దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము
శరణు చొచ్చితిమిఁక క్షమియించుకొనవే


రేకు: 0240-04 పాడి సం: 03-230 ఉపమానములు

పల్లవి:

ఏకాలము నామనే(???) యెరిఁగిన దాసులకు
దాకొని శ్రీహరి భక్తిధారణ గలిగితేను

చ. 1:

తొడుకు మేయఁగరాదు తూర్పెత్తితేఁ బొల్లువోదు
బడినే శ్రీహరిభక్తి పంట పండితే
వుడివోదేకాలము వొకతతి రావద్దు (?)
చెడని శ్రీహరిభక్తి చెట్టుకట్టితేను

చ. 2:

వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్తి గాదు
కొలచి శ్రీహరిభక్తి కుప్ప చేసితే
యెలుకకుఁ దినరాదు యెన్నాళ్లున్నాఁ జివుకదు
తలఁచి హరిభక్తి చిత్తపుగాదెఁ బెట్టితే

చ. 3:

కఱవుకుఁ లోఁగాదు సుంకరవాని కబ్బదు
యెఱుకతో హరిభక్తి యిల్లు నిండితే
నెఱవై శ్రీవేంకటేశ నీకృపగలవారికి
గుఱిగాఁగ హరిభక్తి కూడపెట్టుకొంటేను


రేకు: 0240-05 దేసాళం సం: 03-231 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

విశ్వరూప నీ మూర్తి వివేకించలేను నేను
శాశ్వతుఁడ నీవున్నచందమేమీ నెఱఁగ

చ. 1:

నిబ్బరమై లోకమెల్లా నిండుక వుండుదువట
దొబ్బుకొంటాఁ దిరిగేము తోవల నిన్ను
వుబ్బి సముద్రమువలెనున్న నీ ప్రకృతియందు
గబ్బినై యీఁదుచున్నాఁడఁ గలఁగకుమీ

చ. 2:

కడయు మొదలులేని కాలము నీతనువట
నడుమ నందుతోనే పెనఁగుచున్నాఁడ
అడరి నీ సొమ్ములైన ఆత్మలలో నొకఁడనై
చిడుముడినున్నవాఁడ చిక్కువఱచకుమీ

చ. 3:

పరమున నిహమునఁ బ్రబలియున్నాఁడవట
గరిమ సోదించేము కమ్మటి నిన్ను
ఇరవై శ్రీవేంకటేశ నిన్నిటా నిన్ను నేము
శరణు చొచ్చితిమిఁక చనవిచ్చి కావుమీ


రేకు: 0240-06 నాట సం: 03-232 హనుమ

పల్లవి:

కొలిచినవారికిఁ గొమ్మని వరములిచ్చీ
వెలయఁ గలశాపుర వీధి హనుమంతుఁడు

చ. 1:

బెట్టుగా నొకచేతఁ జూపెడి తన ప్రతాపము
పట్టుకున్నాఁ డొకచేతఁ బండ్లగొల
మెట్టుకొన్నవి రాకాసిమెదడుతోడి తలలు
రట్టడి కలశాపుర దిట్ట హనుమంతుడు

చ. 2:

చెచ్చెర వీనుల నాలించేది సురల నుతులు
కొచ్చికొచ్చి తోఁకఁ జుట్టుకొన్నది నింగి
తచ్చి చూచేది కన్నుల దాసులమీఁది కరుణ
రచ్చకెక్కెఁ గలశాపురము హనుమంతుఁడు

చ. 3:

వసుధ మతిలోనిది స్వామికార్యవిశ్వాసము
వెసఁ దన పనైనది విష్ణుభక్తి
పసగా శ్రీవేంకటేశ బలు నీ బంట్లలోన
రసికుఁడు కలశాపురము హనుమంతుఁడు