తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 243

వికీసోర్స్ నుండి


రేకు: 0243-01 శంకరాభరణం సం: 03-242 నృసింహ

పల్లవి:

కలిగిన మీఁదాఁ గడమేలా
పలులంపటములఁ బడుటే కాక

చ. 1:

దురిత మణఁగె నిటు తుదకెక్కె సుఖము
హరి యొక్కఁడె గతియన్నపుడే
పొరి నిఁకఁ జేసెటి పుణ్యములెల్లా
వరుసతోడ నెవ్వరికో కాని

చ. 2:

సార మెరిఁగె తనజన్మము గెలిచెను
శ్రీరమణునిఁ దలఁచినయపుడే
సైరణతో నిఁకఁ జదివేటి చదువు
మేరమీఁద నేమిటికో కాని

చ. 3:

శ్రీవేంకటపతి చిత్తాన నిలిచెను
కావించి గురునిఁ గన్నపుడే
భావించి యితరప్రార్థన లన్నియు
యీవలావలను యెందుకో కాని


రేకు: 0243-02 వసంతవరాళి. సం: 03-243 అధ్యాత్మ

పల్లవి:

వట్టి స్వతంత్ర మిందు లేదు వావాద మిందు లేదు
గుట్టు దెలియక లోలో గునిసేరు వీరివో

చ. 1:

నేరిచి బ్రదుకువారు నేరక వీఁగేటివారు
యేరీతిఁ జూచినాను యెవ్వరు లేరు
తీరుగాఁ దమలోనుండే దేవుఁడు పెరరేఁచఁగా
మేరతోనే జీవులెల్లా మెరసేరు వీరివో

చ. 2:

కొందరు గొప్పజీవులు కొందరు చిన్నజీవులు
యెందుఁ జూచినా భూమి నెవ్వరు లేరు
బొందులే వేరువేరుగాఁ బుట్టించె దేవుఁడే
అందాలు సేయఁగ లోకు లమరేరు వీరివో

చ. 3:

అసుర కాణాచివారు అమర కాణాచివారు
యెసఁగ విచారించుకో నెవ్వరు లేరు
వెస శ్రీవేంకటేశుఁడు వినోదించినయట్టు
వసుధ మీఁదటఁ గానవచ్చేరు వీరివో


రేకు: 0243-03 కన్నడగౌళ సం: 03-244 అధ్యాత్మ

పల్లవి:

సరవులు దెలియఁగఁ జనుఁ గాకా
పరమార్థములో భంగము గలదా

చ. 1:

హరి స్వతంత్రుఁడట హరిసంకల్పము
విరసంబౌనా విశ్వమున
సరవిఁ బ్రపంచపు సకలమతంబులు
వరుస నెంచఁ గొదువలు మఱి కలవా

చ. 2:

యితఁడు పూర్ణుఁడట యితని విహారము
వెతకఁగవలెనా వేమరును
కతకరచిన యీకన్ను లెదిటివే
మతిఁ దోఁచీనిఁక మఱఁగులు గలవా

చ. 3:

అంతరాత్మయట అతని వేరే
చింతించవలెనా సిలుగులను
చెంతనే యిదివో శ్రీవేంకటేశుఁడు
యెంత దెలిసినా యతరము గలదా


రేకు: 0243-04 దేసాళం సం: 03-245 దశావతారములు

పల్లవి:

అచ్చుతు కృపాలబ్ధ మదియుఁగాక
మచ్చిక నాతఁడు సేసే మతకముఁ గాక

చ. 1:

నానాపాట్లఁ బడె నాఁడు కరి మకరిచే
హీనదెస ప్రహ్లాదుడు హిరణ్యుచేఁ బాటువడె
పానిపట్టి హరి యది పరిహరించనివాఁడా
ఆనుక హరిదాసుల కంతటనే భంగమా

చ. 2:

తగిలి భీష్ముడు శరతల్పమందు నుండఁడా
అగడై విభీషణుఁడు అన్నచేఁ దన్నువడఁడా
పగపాడే చూచుచుండ భాగవతులను హరి (?)
తగినపుణ్యుల నిందు తప్పు లెంచవచ్చునా

చ. 3:

మంతనాన నారదుఁడు మాయలకుఁ లోనుగాఁడా
చెంతల నర్జునునకు చేతులు దెగిపడవా
ఇంతలో శ్రీవేంకటేశుఁడిట్టె వీని మన్నించఁడా
ఇంతటి మహానుభావు లిందుకు జడుతురా


రేకు: 0243-05 దేసాక్షి సం: 03-246 శరణాగతి

పల్లవి:

పుట్టుగు నీయాధీనమే భోగము నీయాధీనమే
అట్టే యీభావనకు నరుదయ్యీ నాకు

చ. 1:

కాననట్టుండవచ్చు నీకల్పిత సుఖదుఃఖాలు
మేను మోచి మీయాజ్ఞ మీరవచ్చునా
నానాజీవులు పడే నాలిఘోరములు చూచి
దీనికెంత వగతువో దేవ నీ చిత్తానను

చ. 2:

తొట్టిన పాపపుణ్యాలు తొల్లి నీపంపులే
పుట్టిన మీ మాయలెల్లాఁ బో దొబ్బేమా
వొట్టుకొన్నజీవులు వొరలుచుండఁగఁ జూచి
యెట్టు నీవోరిచేవో యీవేదన కిపుడు

చ. 3:

చెచ్చెర యీజన్మములు శ్రీవేంకటేశ్వర నీవే
యిచ్చినవి నీతోడ నెదురాడేమా
నిచ్చలు మావంటివారి నేరుపు నేరాలు చూచి
వచ్చి నే శరణనఁగా వహించుకోవలసె


రేకు: 0243-06 దేవగాంధారి సం: 03-247 గురు వందన, నృసింహ

పల్లవి:

అంతటిదైవమ వటుగాఁగా
చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము

చ. 1:

వెరవునఁ బంచమవేద సారములు
సిరుల నిను నుతించిన నుతులు
సరవితోడి బహుశాస్త్రసంతతులు
నిరతిఁ జెప్పెడిని నీకథలు

చ. 2:

కొంగుపైడియగు గురుమంత్రంబులు
సంగడి వైష్ణవసంభాషలు
నింగికి భూమికి నిజపురాణములు
సంగతిగల నీ సంకీర్తనలు

చ. 3:

వూనిన విధుల మహోపనిషత్తులు
నానాగతి నీనామములు
వీనులకును శ్రీవేంకటేశ మీ-
జ్ఞానార్థములు మిముఁ జదువు చదువులు