Jump to content

లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సమాస విభాగము

వికీసోర్స్ నుండి

4. సమాస విభాగము

సమాస పరిచ్చేదము

సమర్ధములగు, పదములు, ఏకపదముగా, సమసించుట, సమాసమనబడును.

వేరు వేరు అర్ధముల, యందు, స్థిర పడిన రెండుగాని, అంతకుమించి గాని, పదములు ఒక్క అర్ధమును బోధించుచు, ఒకే పదముగా భాసించినచో, సమాసమందురు.

ఉదా : - రామబాణము.

ఇది యొక సమాసము. ఇందు రెండు పదములున్నవి. అవి రెండును వేర్వేరు అర్ధబోధకములైనప్పటికి, సమసింపబడి ఒకే అర్ధమును తెల్పుచున్నవి. రామ - బాణము - ఇందు మొదటి పదమును పూర్వపదమని - రెండవ పదమును, ఉత్తర పదమనియు అందురు.

సమాసము-భేదములు

శబ్దమును అనుసరించి సమాసములు మూడు విధములు.

అవి :
       1) సాంస్కృతికము
       2) ఆచ్చికము
       3) మిశ్రమము

సాంస్కృతిక సమాసము
       సాంస్కృతికము మరల రెండు విధములు.
సిద్ద సమాసము - సాధ్య సమాసము

       కేవల సంస్కృత పదములు సంస్కృత వ్యాకరణము ననుసరించి, సమసింపబడినవి సిద్ధ సమాసములు.

ఉదా : - రాజపుత్రుడు
         రాజాజ్ఞ
         తటాకోదకము.

తత్సమపదములతో, నేర్పడిన, సమాసము సాధ్య సమాసము.
రాజునాజ్ఞ - తటాకంబు నుదకము


ఆచ్చిక సమాసము

అచ్చ తెలుగుపదములతో నేర్పడు సమాసము.

ఉదా : - చెఱువునీరు - ఱేనియానతి
        సిరి చెలువుడు - కుంతి కొడుకు మొదలైనవి.

మిశ్రమ సమాసము : - తత్సమ ఆచ్చిక పదములతో నేర్పడు సమాసము.

ఉదా : - చెఱువునుదకము
         రాజుముదల
         తెల్ల పద్మము.

మంచి బాలుడు మొదలైనవి. మిశ్రమ సమాసమనుట వలన కేవలము సంస్కృత శబ్దములకు, ఆచ్చిక పదములకు, సమాసము చేయరాదు.

అనేకమారులు -ఘృత గిన్నె అని అనరాదు.

సమాసములోని, పదముల ప్రాధాన్యతను బట్టి, సమాసములు నాల్గు విధములుగ విభజింపవచ్చును. అవి:

1) పూర్వపద ప్రాధాన్యము కలవి - ద్విగు సమాసములు
2) ఉత్తర పద ప్రాధాన్యము కలవి - తత్పురుష సమాసములు
3) ఉభయ పద ప్రాధాన్యము కలవి - ద్వంద్వ సమాసములు
4) అన్యపదార్ద ప్రాధాన్యము కలవి - బహువ్రీహి సమాసములు


అర్ద భేదమును బట్టి సమాసములు
అర్ద భేదమును బట్టి సమాసములు ఆఱు విధములు.

అవి :
1) తత్పురుష సమాసము
2) కర్మధారయ సమాసము
3) ద్విగు సమాసము
4) ద్వంద్వ సమాసము
5) బహువ్రీహి సమాసము
6) అవ్యయీ భావ సమాసము

1. తత్పురుష సమాసము

ఉత్తర పదార్ధము ప్రధానముగా గలది తత్పురుష సమాసము. రామ బాణము - ఇందు పూర్వపదము రామ - ఉత్తరపదము బాణము. రామ బాణముతో చంపెను. అనగా ఇందు బాణము ప్రధానము. క్రియతో సంబంధము కలిగియుండును. మొదటి పదము లోపించిన విభక్తి పేరు సమాసమునకు వచ్చును. ఇది వ్యధి కరణ సమాసము. లోపించిన విభక్తిని చేర్చి చెప్పుట విగ్రహ వాక్యము.

సమాసము విగ్రహవాక్యము సమాసనామము
1 అర్ధ రాజ్యము రాజ్యము యొక్క అర్ధభాగము ప్రధమా తత్పురుష సమాసము
కడతల తల యొక్క కడ భాగము
2 కృష్ణ శ్రితుడు కృష్ణుని ఆశ్రయించిన వాడు ద్వితీయా తత్పురుష సమాసము
నెలతాల్పు నెలను ధరించిన వాడు
3 గుణహీనుడు గుణము చేత హీనుడు తృతీయ తత్పురుష సమాసము
నెల తక్కువ వాడు నెలచేత తక్కువ వాడు
4 పూజా పూజ కొఱకు చతుర్దీతత్పురుష సమాసము
గృహము దేవర మేలు గృహము దేవర కొఱకు మేలు.
5 ప్రాణాధికుడు ప్రాణముకంటె అధికుడు పంచమీతత్పురుష సమాసము
దొంగ భయము దొంగ వలన భయము
6 రాజభటుడు రాజుయొక్క భటుడు షష్ఠీ తత్పురుష సమాసము
చెట్టు కొమ్మ చెట్టు యొక్క కొమ్మ
7 గృహకృత్యములు గృహమందలి కృత్యములు సప్తమీ తత్పురుష సమాసము
మాటనేర్పరి మాటయందు నేర్పరి
8 అజ్ఞానము జ్ఞానము లేనిది నఙ్ఞ్ తత్పురుష సమాసము
అసత్యము సత్యము కానిది

2. కర్మధారయ సమాసము :

విశేషణ, విశేష్యముల (నామవాచకము) తో ఏర్పడు సమాసము కర్మధారయ సమాసము. ఇది సమానాధి కరణ సమాసము.

_
1 సరసపుమాట సరసమైన మాట విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పెద్ద గుఱ్ఱము పెద్దదైన గుఱ్ఱము
2 బ్రాహ్మణ వృద్ధుడు. వృద్ధుడైన బ్రాహ్మణుడు. విశేషణ ఉ. పద కర్మాధారయ సమాసము
కపోత వృద్దము వృద్దమైన కపోతము
3 శీతోష్ణము నీరు శీతము ఉష్ణమై నీరు. వి. ఉభయ పద కర్మధారయ సమాసము
మృదు మధురము కవిత మృదువు మధురమైన కవిత
4. చిగురు కేలు చిగురువంటి కేలు ఉపమానపూర్వపద కర్మధారయ సమాసము.
బింబోష్ఠము. బింబము వంటి ఉష్ణము.
5. చరణ కమలము కమలము వంటి చరణము. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము
ముఖారవిందము అరవిందము వంటి ముఖము.
6. కోపాగ్ని కోపమనెడి అగ్ని రూపక సమాసము లేక అవధారణ పూర్వ పద కర్మధారయ సమాసము.
విద్యా ధనము విద్యయనెడి దనము
7. గంగానది గంగ అను పేరుగల నది. సంభావనా పూర్వ పద కర్మధారయ సమాసము
మధురానగరము. మధుర అను పేరు గల నగరము
8. ఆ కన్య త్రికపూర్వక కర్మధారయ సమాసము
ఈ పుస్తకము
9. గాజుల సెట్టి గాజులమ్ము సెట్టి మధ్యమ పద సమాసము

అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. అవధారణ మనగా ఒక వస్తువు నందు మరి యొక ధర్మమును ఆరోపించుట. అట్టిది పూర్వపదముగా గలది. ఇందు గల ఉపమాన ఉపమేయములు రెండు ఒక్కటియే అయి యుండును. దీనినే రూపక సమాస మందురు. సంభావన అనగా గౌరవించుట. ఇందు మొదటి పదము సంజ్ఞావాచకముగ ఉండును. రెండవ పదము జాతి వాచకముగ నుండును.

3. ద్విగు సమాసము :

సంఖ్యా వాచకపదము పూర్వమున కలది ద్విగు సమాసము. ఇవి మూడు విధములు.

1. తద్దితార్థ ద్విగువు : తద్ధిత ప్రత్యయములు చేర్చుటకై చేసిన ద్విగువు.

ఉదా : షాణ్మాతురుడు - ఆఱుగురు తల్లుల కొడుకు.
         ద్వైమాతురుడు.

2. ఉత్తరపద ద్విగువు : ఉత్తర పదము పరముగా నుండగా వచ్చు ద్విగువు.

ఉదా : పంచగవధనుడు - ఐదు ఆవులు ధనముగా గలవాడు. ధన అను ఉత్తరపదము పరముగా నుండుటచే వచ్చిన ద్విగువు.
        ఇట్లే - ద్వ్యహ్నజాతుడు.
        రెండు దినముల క్రింద పుట్టిన వాడని భావము.

3. సమాహారద్విగువు : సమాహారమని అర్దమిందువచ్చును.

  త్రిలోకి - మూడు లోకముల సమాహారము.
     శతగ్రంధి - శతమైన గ్రంధముల సమాహారము.

4. ద్వంద్వ సమాసము :

ఉభయ పదముల అర్ధము ప్రధానముగా గలది ద్వంద్వసమాసము, విగ్రహ వాక్యమున ను - అను సమ్చుయము చేర్చబడును.

ఇవి రెండు విధములు.

ద్విపద ద్వంద్వము :
ఉదా : రామకృష్ణులు - అన్నదమ్ములు
       రాధాకృష్ణులు - మొదలైనవి.

రెండు కన్న యెక్కువ పదములతో కూర్చిన
బహుపద ద్వంద్వ సమాసము :
ఉదా : ధర్మార్ధకామమోక్షములు.
       సత్త్వరజస్తమో గుణములు.

5. బహువ్రీహి సమాసము :

కర్మధారయము కన్న - కల అను అర్ధము ఎక్కువగా నున్న, బహువ్రీహి సమాసము. రెండు పదముల అర్ధములేక వేరైన మరొక అర్ధము ప్రధానమైన బహువ్రీహి సమాసము. పీత + అంబర - అనుపదములకు పచ్చని వస్త్రమని అర్ధమైనను - వీటి కలయికచే వేరొక అర్ధము స్పురించు చున్నది. అన్యపదార్ధము ప్రధానమైనది బహువ్రీహి. పీతాంబరుడు - పచ్చనివస్త్రము కలవాడు. ఇందు విగ్రహ వాక్యమున కలది కలవాడు అనివచ్చును. ఇది యెప్పుడును విశేషణమే కాన విశేష్యమును బట్టి లింగవచన విభక్తులుండును.

కమాలాక్షుడు = కమలముల వంటి కన్నులు కలవాడు (విష్ణుమూర్తి)

పద్మాలయ = పద్మము నిలయముగా కలది (లక్ష్మి).

6. అవ్యయీభావ సమాసము :

లింగ, వచన, విభక్తులు, లేని అవ్యయములు. అవ్యయము పూర్వపదముగా కలది అవ్యయీ భావ సమాసము.

       యధావిధి - ప్రతిదినము - ఇందు
       యధా - ప్రతి అనునది అవ్యయములు.
       యధావిధి - విధి నతి క్రమింపక.
       ప్రతిదినము - దినము, దినము
       వ్రత్యహము - అహాము, అహాము.
       అని విగ్రహము చెప్పు కొనవలెను.
       ఈ సమాసము తెలుగునలేదు.

ప్రశ్నలు

1) సమాసమనగానేమి? శబ్దము ననుసరించి సమాసము లెన్ని రకములు? అవియేవి?

2) ఆచ్చిక సమాసమును సోదాహరణముగ తెల్పుము?

3) అర్ధ భేదమును బట్టి సమాసము లెన్ని రకములు? అవి యేవి?

4) అవ్యయీభావ సమాసమనగానేమి? సోదాహరణముగ తెల్పుము?

5) ఈక్రింది సమాసము లేవో తెల్పుము.

1) కడతల 2) నెలతాల్పు 3) గుణహీనుడు 4) మాటనేర్పరి 5) కపోత వృద్ధము 6) గంగానది 7) గాజులసెట్టి 8) ద్వైమాతురుడు 9) రామకృష్ణులు 10) పద్మాలయ