పుట:హాస్యవల్లరి.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ము. బా - ఇది మీరే ఉంచండి. ఉంచి ఇదెట్టి క్షౌరం చేయించుగుందురు, బాబూ, బతకలేకుండా ఉన్నాం,

92

షరాబు - డబ్బు ఇవ్వడానికి మరేమీ ఆక్షేపణ లేదుగాని గాని మీరు అచ్చంగా మీరే అనే సర్టిఫికట్టు ఓటి ఉండి తీరాలి.

ఆవిడ - నేను నేనే కదండీ, ఎప్పుడూనూ!

ష - ఆ తెలివి కట్టెయ్యవమ్మా! పుట్టుమచ్చలు వగైరాలతో ఒక కాగితం ఉండాలి, లేకపోతే వీలుండదు.

ఆ - అది ఇప్పట్లో పట్రాలేనుగాని నా దగ్గిర ఒక ఉత్తరం ఉంది. అందులో ఒకరు నన్ను పూర్తిగా వర్ణించారు. నేను నే నవునో కాదో చూసుకోండి. మళ్లీ మా ఆయనతో అనకండిస్మీ ఈ గొడవ!

93

వెంకమ్మ - ఆసంగతి రామక్కతో చెప్పద్దని చెబితే చెప్పేశావూ?

పుల్లమ్మ - ఎంత మొగవీరుడమ్మా, రామక్కా! తనతో చెప్పినట్టు నీతో చెప్పద్దంటే చెప్పిందీ!

వెం - సరేలే. ఆమాట నీతో చెప్పనని రామక్కతో చెప్పాను. ఈమాట మళ్ళా ఆవిడతో చెప్పకు.

94

బస్తీస్కూల్లో నాలుగోక్లాసు ఒకడూ అయిదోక్లాసు ఒకడూ చదివేసిన ఇద్దరు అన్నదమ్ములు సెలవలకి ఇంటికొచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఇంగ్లీషునే మాట్లాడుకోవాలని సంకల్పించుగుని,

పెద్ద - ఒరేయి! బురదర్రూ! నాన్న కాల్తున్నాడ్రోయి! దబ్బున్రారోయ్!

చిన్న - ఎప్పుడ్రా? కాల్తా? నాకు తెలియదే?

పెద్ద - ఇందాకా ఏయిటింటికిరా కాలిందీ!

తల్లి - మీనాన్నేట్రా ఏటింట్లో కాల్తా! అయ్యొ, అయ్యొ నా పసుపూ!

95

దుమ్ములోపడి దొర్లుతూన్న కొడుకుని రెక్కపట్టుగు లేవదీసి,

తండ్రి - వెధవ మొహం వెధవ! బాడిలో ఏడవద్దని ఎన్ని మాట్లు గద్దెట్టాను? ముష్టెత్తుగు పోతావ్ లే! అంటూండగా పక్కనించి జగ్గప్ప ఇది విని వచ్చి,

జ - ఎవరండీ ఈకుర్రాడు?

తం - మావాడే. ఏం?

జ - ఏంలేదండి. అచ్చంగా మీ మొహమే!

తం - (పొంగిపోయి) ఏదోనాయన! పెద్దలాశీర్వచనం!

96

పెద్దక్లాసులో ఇంగ్లీషుపాఠం చెబుతూ, రంగేశ్వరుడు గారు, మూడేళ్ళు ఆక్లాసే చదివినా ప్రశ్నవేస్తే నోరువిప్పని మారెయ్యతో,

రం - ఛీ! వట్టి శూన్యంలా ఉన్నావేమిటోయ్, నువ్వూ! నీ యీడప్పుడు నేను చాంతాళ్ళలాంటి ఇంగ్లీషు ప్రశ్నలు ఇల్లా ఊరికే ఉప్పున ఊదిపారేసేవాణ్ణీ.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

21

హాస్యవల్లరి